ఉత్తమ్ కీ రోల్! రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్లో మారిన సీన్

ఉత్తమ్ కీ రోల్! రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్లో మారిన సీన్
  • ఉత్తమ్ కీ రోల్!
  • రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్లో మారిన సీన్
  • సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చోటుతో పెరిగిన ప్రాధాన్యం
  • ఇక్కడ పీఈసీ, స్క్రీనింగ్ కమిటీల్లోనూ ఆయన సభ్యుడు
  • అభ్యర్థులను ఫైనల్ చేయాల్సిన 3 చోట్లా ఉత్తమే కీలకం
  • అందుకే ఆయన చుట్టే ఆశావహుల ప్రదక్షిణలు

పీసీసీ మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పాలిటిక్స్ లో కీలకంగా మారారు. రాష్ట్ర స్థాయి లోని ప్రదేశ్ ఎలక్షన్ కమిటీతో పాటు స్క్రీనింగ్ కమిటీలో ఉత్తమ్ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలోనూ ఆయనను అధిష్టానం నియమించింది. దీంతో టికెట్ల ఖరారులో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకంగా మారారు. మొన్నటి వరకు ఆయన పార్టీ వీడుతారని బీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం గుప్పుమంది. పార్టీలోని ఓ వర్గం కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఉత్తమ్ వివరణ ఇచ్చినా పుకార్లు అదే విధంగా షికారు చేశాయి. వాటన్నింటినీ కొట్టి పారేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్ర ఎన్నికల కమిటీలో చోటు కల్పించింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకు టికెట్ల కోసం పీసీసీ చీఫ్ రేవంత్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారు.. పైరవీలు చేసుకున్న వారంతా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు చూస్తున్నారు.

మూడు చోట్ల ఆయనే..

కాంగ్రెస్ టికెట్లు ఖరారులో ఉత్తమ్ కీలకంగా మారారు. వడపోత మొదలు బీఫారం వరకు అంతా ఆయన నేతృత్వంలోనే సాగనుంది. 119 అసెంబ్లీ స్థానాలకు ఆశావహుల నుంచి పీసీసీ దరఖాస్తులను ఆహ్వానించగా వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని 29 మంది సభ్యులున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ సార్టవుట్ చేసింది. అందులో ఉత్తమ్ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఇవాళ జరుగుతున్న కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీలోనూ ఉత్తమ్ సభ్యుడిగా ఉన్నారు. ఇక్కడ వడపోసిన దరఖాస్తులను ఫైనల్ చేసే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలోనూ ఉత్తమ్ సభ్యుడిగా ఉంటుండడం విశేషం. దీంతో ఉత్తమ్ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు.

ఐదేండ్ల పాటు పదవిలో..

ఐదేండ్ల పాటు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కొనసాగనుంది. అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థులను సెలెక్ట్ చేసే కీలక కమిటీలో ఉత్తమ్ ను తీసుకోవడం విశేషం. కీలకమైన ఈ కమిటీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు మరో 13 మంది సభ్యులున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. దీనిని బట్టి ఉత్తమ్ దక్షిణ భారతదేశానికి సంబంధించిన కీలక నేతగా ఏఐసీసీ భావిస్తోందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో కూడా ఉత్తమ్ ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ కమిటీలో చేర్చినట్లు టాక్ కూడా వినిపిస్తుంది.