
- నిందితుల వద్ద రూ. 50 లక్షలకుపైగా సొత్తు స్వాధీనం
- నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి
నల్గొండ అర్బన్, వెలుగు : కార్లలో వచ్చి మేకలు, గొర్లను ఎత్తుకెళ్తున్న నాలుగు దొంగల ముఠాలను నల్గొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 14 మందిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద రూ.2.46 లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 50 లక్షలకుపై ఉంటుంది. మంగళవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో మేకలు, గొర్లు చోరీ అవుతున్నట్టు వరుసగా ఫిర్యాదులు అందుతుండగా పోలీసులు ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. ఆదివారం సాయంత్రం శాలిగౌరారం మండలం బైరవోని బండక్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు ఆపమన్నా ఆపకుండా స్విఫ్ట్ డిజైర్ లో పారిపోయారు.
కారును వెంబడించి పట్టుకుని ముగ్గురు పురుషులు, మహిళను అదుపులోకి తీసుకున్నారు. వారు మేకలు , గొర్ల చోరీ నిందితులని తేలింది. వారిని నల్గొండ14 మైల్ కు చెందిన సంపంగి వెంకటేశ్, వెంరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంపంగి శారద, నిడమనూర్ కు చెందిన దాసర్ల వినోద్ కుమార్ అలియాస్ కోటిగా గుర్తించారు. వీరు మరో 12 మందితో కలిసి నాలుగు ముఠాలుగా ఏర్పడ్డారు. జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో మేకలు, గొర్ల చోరీ కేసులు నమోదై అరెస్టై జైలుకు వెళ్లివచ్చినట్టు వెల్లడైంది. వారి సమాచారం మేరకు.. రెండో ముఠాలోని నిందితులు మర్రిగూడెంకు చెందిన వరికుప్పల రవి అలియాస్ చింటూ, రంగారెడ్డి జిల్లాకు చెందిన గండికోట శివకుమార్, ఏపీలోని పల్నాడుకు చెందిన అమ్ములూరి విజయ్, మర్రిగూడెంకు చెందిన వరికుప్పల రాజు, హైదరాబాద్ కు చెందిన లింగాల అశోక్, ఉండం కళ్యాణిని పట్టుకోగా.. కోటేశ్, అలియాస్ లడ్డూ, కనుకుల బేబీ పరారీలో ఉన్నారు.
మూడో ముఠాలోని యాదాద్రి జిల్లా భువనగిరి చెందిన వల్లెపు ప్రసాద్, మహబూబ్ నగర్ కు చెందిన మత్యాల సహదేవ్ ను.. నాలుగో ముఠాకు చెందిన సూర్యాపేట జిల్లా చెందిన కొడిసే వంశీకృష్ణ, కంపాటి హుస్సేన్, కంపాటి అజయ్ కుమార్, మట్టి సురేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయా ముఠాలు ఖరీదైన కార్లలో వెళ్లి పగటి పూట రెక్కి చేస్తారు. రాత్రిపూట వెళ్లి మేకలు, గొర్లను కార్లలో ఎత్తుకెళ్తున్నారు. వాటిని సంతల్లో అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. ఇలా నల్లొండ జిల్లాలో 15 , రాచకొండ, సైబరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల పరిధిలో 10 ప్రాంతాల్లో చోరీలు చేశారు.
మొత్తం 23 కేసుల్లో 200కుపైగా మేకలు, గొర్లను ఎత్తుకెళ్లారు. ఈ కేసును చేధించిన నల్గొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, సీసీఎస్ సీఐలు ఎం.జితేందర్ రెడ్డి. ఎం.నాగభూషణ్, శాలిగౌరారం సీఐ కె.కొండల్ రెడ్డి, నార్కట్ పల్లి సీఐ కె. నాగరాజు, ఎస్ఐలు శివకుమార్, విజయ్ కుమార్, రవి, రవి కుమార్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, వహీద్ పాషా, సూఫీయాన్ అలీ, రామ్ ప్రసాద్, నాగరాజు, సీసీఎస్ కానిస్టేబుల్ ఆశ్రార్, మహేశ్, సాయి, వెంకట్ రామ్‌ను ఎస్పీ అభినందించారు. ప్రశంసా పత్రాలు, రివార్డులు అందించారు.