రేపు నల్గొండలో రాజ్యాధికార సంకల్ప సభ

రేపు నల్గొండలో రాజ్యాధికార సంకల్ప సభ
  • బీఎస్పీలో చేరనున్న మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్
  • సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు

నల్లొండ: ఐపీఎస్ పోస్టుకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టనున్న సందర్భంగా మాజీ పోలీసు బాస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రేపు ఆదివారం ‘‘రాజ్యాధికార సంకల్ప సభ’’ నిర్వహించనున్నారు. సభను 10 వేల మందితో నిర్వహించాలని తలపెట్టామని.. సభకు అనుమతివ్వాలంటూ జిల్లా బీఎస్పీనాయకులు దరఖాస్తు చేసుకోగా పోలీసులు అనుమతించారు. బీఎస్పీ నాయకుల వినతి మేరకు 100 మంది కానిస్టేబుళ్లు ,27 మంది ఏసైలు, 6 సీఐలు, ఇద్దరు డిఎస్పీలు సభకు బందోబస్తు నిర్వహించనున్నారు. 
నల్లగొండ నాగార్జున డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో మీటింగ్ కి తెలంగాణ నలుమూలల నుండి తరలిరావాలని పిలుపునిస్తూ.. గత రెండు వారాలుగా అన్ని జిల్లాల్లో ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేశారు. ఎవరి తిండి వారిదే.. ఎవరి చార్జీలు వారే పెట్టుకుని సభకు తరలివచ్చి సత్తా చాటాలన్న ప్రవీణ్ కుమార్ పిలుపునకు ఎంత మంది స్పందిస్తారు..? సభకు ఎంత మంది వస్తారనే ఆసక్తికరంగా మారింది. పోలీసులు మాత్రం ఎంత మంది వచ్చినా బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 
నల్లగొండ పట్టణంలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ‘‘రాజ్యాధికార సంకల్ప సభ’’ ద్వారా ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ వాది పార్టీలో చేరనున్నారు. బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ ఆధ్వర్యంలో ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.