సీఎం దత్తత పట్టణంలో చిత్ర విచిత్రాలు

సీఎం దత్తత పట్టణంలో చిత్ర విచిత్రాలు
  •     ఏకపక్షంగా నిర్ణయాలు.. ప్లానింగ్​లో లోపాలు
  •     ప్రజాభిప్రాయాలు, అభ్యంతరాలను పట్టించుకోవట్లే

నల్గొండ, వెలుగు: సీఎం కేసీఆర్ దత్తత పట్టణం నల్గొండ డెవలప్​మెంట్​విషయంలో లోకల్స్​మాట నెగ్గట్లేదు. యాక్షన్ ప్లాన్స్ అన్నీ ఏకపక్షంగా జరిగిపోతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగానే నల్గొండ పట్టణాభివృద్ధి ప్రణాళికలు, నుడా ప్రపోజల్స్ ఫైనల్ చేస్తున్నారు. పట్టణాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే మున్సిపల్​పాలకవర్గం, ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే సలహాలు, సూచనలకు ఏమాత్రం విలువివ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైకి ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ సమక్షంలోనే ప్లానింగ్ అంతా జరుగుతున్నట్టు కనిపిస్తున్నా తెరవెనక మాత్రం హైదరాబాద్​ స్థాయి ఆఫీసర్లదే  పైచేయిగా నిలుస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆరు నెలల వ్యవధిలో పట్టణ రూపురేఖలు మార్చాలన్న సీఎం సూచన మేరకు నెల రోజులుగా నల్గొండ టౌన్​లో మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ సుడిగాలి పర్యటనలు చేశారు. వార్డులు, పార్కులు, పట్టణ పరిసర ప్రాంతాలన్నీ చుట్టొచ్చారు. కానీ చివరకు సీఎం సొంత మనిషిగా ముద్రపడ్డ మున్సిపల్ కమిషనర్ రమణాచారి చెప్పినదానికే ప్రభుత్వ పెద్దలు గ్రీన్​సిగ్నల్ ఇచ్చారు. నల్గొండ పట్టణాన్ని విస్తరించేందుకు చేపట్టిన నుడా(నీలగిరి అర్బన్ డెవలప్​మెంట్​అథారిటీ) ప్లానింగ్​లోనూ ఎమ్మెల్యే, జిల్లా ముఖ్యనేత ముందుండి నడిపించినట్లు కనిపించినా అంతిమంగా మాత్రం కేటీఆర్ డైరెక్షన్​నే అంతా ఫాలో అవుతున్నారే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పట్టణ ప్లానింగ్​లోని లోపాల గురించి స్థానికులు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నా.. మున్సిపల్ కౌన్సిల్​లో వ్యతిరేకించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.  

అధికార పార్టీ కౌన్సిలర్లలో అసంతృప్తి

నల్గొండ మున్సిపల్ డెవలప్​మెంట్​గురించి ఇప్పటివరకు జరిగిన ప్లానింగ్ లో పాలకవర్గం ప్రేక్షకపాత్ర పోషించిందని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పట్టణంలో పేరుకుపోయిన సమస్యలను ప్లానింగ్​లో చేర్చకుండా కేవలం రోడ్ల వెడల్పు, లైటింగ్, పార్కుల డెవలప్​మెంట్​కే ఫండ్స్ కేటాయించడా న్ని సభ్యులు తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న మార్కెట్లకు సంబంధించి ప్లానింగ్​లో మార్పులు చేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు చెప్తున్నప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదేమంటే సీఎం సార్ చెప్పినట్లు నడుచుకోవడమే తప్ప మరో మార్గం లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. బీట్​మార్కెట్‌‌‌‌లో నాన్​వెజ్ మార్కెట్ ఏర్పాటును ఆర్యవైశ్య సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సమీపంలో వాసవి మాత టెంపుల్ ఉండటం, ఆ ప్రాంతంలో ఆర్యవైశ్యులు ఎక్కువగా నివసిస్తుండటంతో నాన్​వెజ్ మార్కెట్ వద్దని కోరుతున్నారు.  అదే విధంగా ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ వద్ద ఏర్పాటు చేయాలనుకున్న రైతుబజార్, బస్తీ దవాఖానలను స్టూడెంట్​యూనియన్లు, కాలేజీ ఓల్డ్​స్టూడెంట్స్, పొలిటికల్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అక్కడ గతంలో నిర్మించిన రైతుబజార్​తో ఉపయోగం లేదని, దాన్ని తొలగించి ఆ ప్లేస్​లో ఎస్సీ హాస్టల్ బిల్డింగ్ కట్టారు. మళ్లీ అదే ఏరియాలో రైతుబజార్ నిర్మిస్తే భవిష్యత్తులో కాలేజీ విస్తరణకు అడ్డంకిగా మారుతుందని చెప్తున్నారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్​కు సంబంధించి ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్​లో ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ఇప్పటివరకు ఫండ్స్ కేటాయించకపోవడం గమనార్హం. 

మార్కెట్లకు ప్రత్యామ్నాయ స్థలాలు గుర్తించాలి

బీట్​మార్కెట్​లో నిర్మించాలనుకున్న నాన్​వెజ్ మార్కెట్,  ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద నిర్మించాలనుకున్న రైతుబజార్ కు ప్రత్యామ్నాయ స్థలాలు గుర్తించాలి. క్లాక్​టవర్​సెంటర్ వద్ద ప్రతిపాదించిన కళాభారతిలో ఎకరం స్థలం మార్కెట్లకు కేటాయించాలి. ఇదే విషయాన్ని కౌన్సిల్ మీటింగ్​లోనూ చెప్పాం.
– బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్

నుడా ప్లానింగ్ పై ఆందోళన

నుడా ప్లాన్ నాలుగు సార్లు మార్చారు. ప్లాన్ నల్గొండ సెగ్మెంట్ దాటిపోకుండా ఉండేందుకు రూలింగ్​పార్టీ లీడర్లు శతవిధాలా ప్రయత్నించారు. కానీ చివరకు నుడా నిర్మాణానికి భూములు సరిపోవని నకిరేకల్ నియోజకవర్గంలోని మూడు మండలాలు చేర్చారు. ఈ మండలాలను చేర్చడంలో ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పార్టీ పెద్దలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. చివరకు నుడాలో చేర్చిన గ్రామాల లిస్ట్​లో కూడా గందరగోళం నెలకొంది. గెజిట్​లో 41 విలేజ్​లుగా పేర్కొనగా నల్గొండ టౌన్ పరిధిలోని విలేజ్​లతో కలిపి 51 అని ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే ఈ విలేజ్​ల పరిధిలో ఉన్న గ్రామాలను గెజిట్ లో పేర్కొనలేదు. దీంతో గెజిట్​లో పబ్లిష్ చేసిన విలేజ్​ల వరకే నుడా వర్తిస్తుందా.. లేదంటే వాటికి ఆనుకుని ఉన్న గ్రామాలకు కూడా వర్తిస్తుందా.. అనే క్లారిటీ కొరవడింది. నుడా కమిటీ మెంబర్స్ లిస్ట్​లో ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డిని చేర్చడంపైనా రూలింగ్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో ముఖ్యమైన లీడర్లను కాదని కొత్తగా ఎన్నికైన నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన కోటిరెడ్డిని నుడాలో మెంబర్​గా ఎలా నియమిస్తారని రూలింగ్ పార్టీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. డెవలప్​మెంట్​ప్లానింగ్​లో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు, ఫ్లోర్ లీడర్లు బుధవారం నాటి వరంగల్ పర్యటనను సైతం బహిష్కరించారు.