హుబ్బలీ: తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించిన జమ్మూ కాశ్మీర్.. కర్నాటకతో టైటిల్ ఫైట్‌ను దీటుగా ఆరంభించింది. శుభమ్ పుండిర్ (117 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగడంతో.. మంగళవారం తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 284/2 స్కోరు చేసింది. శుభమ్‌తో పాటు అబ్దుల్ సమద్ (52 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన జమ్మూకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో కమ్రాన్ ఇక్బాల్ (6)ను ప్రసిధ్ కృష్ణ (2/36) ఔట్ చేశాడు. 18/1 స్కోరు వద్ద వచ్చిన శుభమ్.. యావర్ హసన్ (88)తో కలిసి నిలకడగా ఆడాడు. ఈ ఇద్దరు కలిసి కర్నాటక బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో హసన్ 77, శుభమ్ 100 బాల్స్‌లో హాఫ్ సెంచరీలు సాధించారు. 51వ ఓవర్లో హసన్‌ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు 139 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. కెప్టెన్ పారస్ డోగ్రా (9) రిటైర్డ్ హర్ట్ కావడంతో క్రీజులోకి వచ్చిన సమద్ అద్భుతంగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. 186 బాల్స్‌లో శుభమ్ సెంచరీ పూర్తి చేసుకోగా, సమద్ 64 బాల్స్‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. ఈ క్రమంలో మూడో వికెట్‌కు 105 రన్స్ జోడించి తొలి రోజు జమ్మూను మంచి స్థితిలో నిలిపారు.
