బిహార్లో 23 లక్షల మంది మహిళా ఓటర్ల పేర్లు తొలగింపు.. ఈసీతో కుమ్మక్కై మోదీ ఓట్ చోరీ.. కాంగ్రెస్ ఆరోపణ

బిహార్లో 23 లక్షల మంది మహిళా ఓటర్ల పేర్లు తొలగింపు.. ఈసీతో కుమ్మక్కై మోదీ ఓట్ చోరీ.. కాంగ్రెస్ ఆరోపణ
  • అఖిల భారత మహిళా 
  • కాంగ్రెస్ చీఫ్​ ఆరోపణ
  •     ఆ మహిళల హక్కులను కూడా దొంగిలించారని ఫైర్
  •     ప్రధాని బండారాన్ని 
  • బట్టబయలు చేస్తామని కామెంట్


న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్​లో 23 లక్షల మంది మహిళా ఓటర్ల పేర్లను స్పెషల్  ఇంటెన్సివ్  రివిజన్ (సర్) పేరుతో తొలగించారని అఖిల భారత మహిళా కాంగ్రెస్  చీఫ్​ అల్కా లాంబా ఆరోపించారు. ఎన్నికల సంఘంతో కుమ్మక్కై ప్రధాని నరేంద్ర మోదీ ఓట్ చోరీకి పాల్పడుతున్నారని ఆదివారం ఓ ప్రకటనలో ఆమె విమర్శించారు. 

60 అసెంబ్లీ సీట్లలో 23 లక్షల మంది మహిళా ఓటర్ల పేర్లను తొలగించారని, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొందని గుర్తుచేశారు. ఓట్ చోరీకి పాల్పడాలని ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్ చోరీ జరగనివ్వబోమని పేర్కొన్నారు.

 ‘‘గత లోక్ సభ ఎన్నికల్లో ఆ 23 లక్షల మంది మహిళలు వేసిన ఓట్లు ఫేక్  ఓట్ల? ఆ ఫేక్ ఓట్ల మీదే ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థులు గెలుపొంది కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారా? ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండతో ఎన్నికల సంఘం బిహార్​లో భారీగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నది. బిహార్​లో దాదాపు 3.5 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే, సర్  పేరుతో 23 లక్షల మంది పేర్లను డిలీట్  చేశారు. ఇప్పుడు ఆ మహిళలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేరు. 
వారి హక్కులను మోదీ, అమిత్ షా దొంగిలించారు” అని అల్కా లాంబా వ్యాఖ్యానించారు.

ఆ 6 జిల్లాల్లోనే ఓట్ చోరీ

గోపాల్ గంజ్, శరణ్, బెగూసరాయ్, సమిస్తపూర్, భోజ్ పూర్, పూర్నియా జిల్లాల నుంచి ఆ 23 లక్షల మంది మహిళా ఓటర్ల పేర్లను తొలగించారని అల్కా లంబా ఆరోపించారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా సిగ్నేచర్  క్యాంపెయిన్  చేపడుతున్నామని, మొత్తం 5 కోట్ల సంతకాలు సేకరించి మోదీ బండారాన్ని బయటపెడతామని పేర్కొన్నారు. ‘‘ఒకవైపు మహిళల ఖాతాలో మోదీ డబ్బులు వేసి ప్రభావితం చేయాలని చూస్తున్నారు. మరోవైపు ఈసీతో కుమ్మక్కై ఓట్ చోరీకి పాల్పడుతున్నా రు. మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి ఓట్ల తొలగించారు” అని లంబా చెప్పారు.