4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని కేసీఆర్.. అదే వ్యూహామా..?

4  స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని కేసీఆర్.. అదే వ్యూహామా..?

గులాబీ బాస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 115 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. చాలావరకూ సిట్టింగులకే టికెట్లు ఖరారు చేశారు. అయితే.. కొన్ని సీట్లలో మాత్రం మార్పులు తప్పలేదు. ఏడుచోట్ల సిట్టింగ్ అభ్యర్థులకు షాక్ ఇచ్చి.. నాలుగు స్థానాల్లో మాత్రం అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. వీటిలో జనగామ,  నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో రచ్చ నడుస్తున్న జనగామ స్థానాన్ని సైతం హోల్డ్‌లో ఉంచారు. దీంతో టికెట్ ముత్తిరెడ్డికా..? ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికా..? లేదంటే  పోచంపల్లికా అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.

జనగామలో ముగ్గురు ఆశావహులు 

జనగామ బీఆర్‌ఎస్‌ టికెట్‌ విషయంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. మరోనేత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కూడా జనగామ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని చాలా మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, లీడర్ల మద్దతు కూడ గట్టుకున్న పోచంపల్లి తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. ముత్తిరెడ్డిపై వ్యతిరేకత ఉన్న బీఆర్‌‌ఎస్‌ లీడర్లంతా పోచంపల్లికి సపోర్ట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మంత్రి కేటీఆర్‌‌, ఎంపీ సంతోష్‌కుమార్‌‌కు అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్‌రెడ్డి జనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చారు. ఇలా ఈ ముగ్గురు నేతలు ఎవరికి వారే పోటీపడటంతో జనగామ అభ్యర్థిని కేటాయించడంలో కేసీఆర్ పెండింగ్ లో పెట్టారని తెలుస్తోంది.

గోషామహల్ విషయంలో..

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపీ సస్పెండ్ చేసింది. కొంతకాలంగా ఆయన పార్టీ మారతారని ఊహాగానాలు వచ్చాయి. గత ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఓడిపోయినా.. కేవలం రాజాసింగ్ ఒక్కరే బీజేపీ పార్టీ నుంచి గెలిచారు. ఈ మధ్యకాలంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఆయనతో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.  ఒకవేళ రాజాసింగ్ బీఆర్ఎస్ లోకి వస్తే ఆయనకే టికెట్ కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 

ఇక్కడ పోటీ నామమాత్రమే..

నాంపల్లి నియోజవర్గంలో ప్రస్తుతం ఎంఐఎం పార్టీకి చెందిన జాఫర్ హుస్సేన్ మెరాజ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో కూడా నాంపల్లి నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ గెలిచింది. ఇక్కడ 2004 నుంచి మజ్లిస్ పార్టీ గెలుస్తూ వస్తోంది. మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఫ్రెండ్లీగానే ఉంటాయని కేసీఆర్ తెలిపారు. ఇక్కడ ఎంఐఎంకే ఎక్కువగా విజయావకాశాలు ఉండటంతో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నామ మాత్రంగానే పోటీచేసే అవకాశం ఉంది.  

నర్సాపూర్ లో ముగ్గురు..

నర్సాపూర్ అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మళ్లీ టికెట్​తనదే అని భావిస్తున్నారు. కానీ.. ఈ టికెట్ విషయంలో మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2023 ఎన్నికల్లో టికెట్ ఇస్తామనే పార్టీ పెద్దల హామీతోనే సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్​లో  చేరారని, అందువల్ల ఈసారి ఎన్నికల్లో టికెట్ ఆమెకే వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీసీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ కోరుతున్నారు. నర్సాపూర్ సెగ్మెంట్ లో ఈ ముగ్గురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.