
విండ్‌హోక్: టీ20 క్రికెట్ ఫార్మాట్లో పసికూన నమీబియా సంచలనం నమోదు చేసింది. పటిష్టమైన దక్షిణాఫ్రిను నమీబియా చిత్తు చేసింది. ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్ ఇచ్చింది. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో రెండో విజయం నమోదు చేసింది నమీబియా.
కాగా, శనివారం (అక్టోబర్ 11) విండ్‌హోక్‌లోని వాండరర్స్ క్రికెట్ గ్రౌండ్‌లో నమీబియా, దక్షిణాఫ్రికా మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. జేమీ స్మిత్ 31, ప్రిటోరియస్ 22, రూబిన్ హెర్మాన్ 23 మినహా మిగిలిన బ్యాటర్లంతా విఫలంగా కావడంతో సౌతాఫ్రికా తక్కువ స్కోర్ చేసింది.
ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్. కానీ ఈ మ్యాచులో డికాక్ పూర్తిగా నిరాశ పర్చాడు. కేవలం 1 రన్ మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మాన్ 3 వికెట్లతో రాణించగా.. మాక్స్ హీంగో రెండు వికెట్లు పడగొట్టాడు. బెన్ షికోంగో, స్మిత్, గెర్మార్డ్ హెరాస్మస్ తలో వికెట్ తీశారు.
అనంతరం 135 స్వల్ప పరుగుల లక్ష్యంతో బరిలోకి నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది. ఉత్కంఠభరితంగా సాగిన చేధనలో చివరి బంతికి విజయం సాధించింది. చివర్లో జేన్ గ్రీన్ (30), ట్రంపెల్మాన్ (11) అద్భుతంగా ఆడి నమీబియాకు విజయాన్ని అందించారు. సౌతాఫ్రికా బౌలర్లలో నాంద్రే బర్గర్, అండిలే సిమెలనే చెరో రెండు వికెట్లు తీయగా.. కోయెట్జి ఒక వికెట్ సాధించాడు.
కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి సఫారీలు:
అక్టోబర్ 12 నుంచి సౌతాఫ్రికా, పాకిస్థాన్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ను దృష్టిలో పెట్టుకుని అనేక మంది కీలక ఆటగాళ్లు లేకుండానే ప్రోటీస్ జట్టు నమీబియాతో టీ20 మ్యాచు ఆడింది. దక్షిణాఫ్రికా టీ20 రెగ్యులర్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ బదులు డోనోవన్ ఫెర్రీరా జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ క్రమంలో తమను తేలికగా తీసుకున్న సౌతాఫ్రికాకు నమీబియా గట్టి షాక్ ఇచ్చింది. పటిష్టమైన సఫారీలపై చివరి వరకు పోరాడి విజయం సాధించి టీ20 క్రికెట్లో సంచలనం నమోదు చేసింది.