రాజాసింగ్ రిమాండ్ రిజెక్ట్.. రిలీజ్ కు కోర్టు ఆర్డర్

రాజాసింగ్ రిమాండ్ రిజెక్ట్.. రిలీజ్ కు కోర్టు ఆర్డర్
  • రాజాసింగ్ బెయిల్ పిటిషన్పై తీవ్ర వాదనలు

హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్ ను నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం.. ఉద్రిక్తతలను నివారించేందుకు రిమాండుకు పంపాలన్న ప్రాసిక్యూషన్ వాదనలను కోర్టు ఏకీభవించలేదు. అరెస్ట్ సమయంలో 41 సీఆర్‌‌పీసీ,సుప్రీంకోర్ట్‌ నియమాలు పాటించలేదన్న వాదనలను గుర్తించింది. దీంతో  రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. అరెస్టు చేసిన రాజాసింగ్ ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది.  రాజాసింగ్ బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో సుమారు 45 నిమిషాలపాటు వాదనలు జరిగాయి.

శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే రాజాసింగ్ ను అరెస్టు చేశామని ప్రాసిక్యూషన్ న్యాయవాది వాదించారు. రాజాసింగ్ కు బెయిల్ ఇస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని.. శాంతిభద్రతలు లోపిస్తాయని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు.  ప్రాసిక్యూషన్ వాదనలను రాజాసింగ్ న్యాయవాది వ్యతిరేకించారు. నమోదైన కేసులన్నీ బెయిలబుల్ కేసులని కోర్టుకు తెలియజేశారు. రాజాసింగ్ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు రిమాండ్ రిక్వెస్ట్ ను తోసిపుచ్చింది. రిలీజ్ చేయాలని ఆదేశించింది. అయితే పోలీసుల విచారణకు ఎమ్మెల్యే రాజాసింగ్ సహకరించాలని చెప్పింది. 

రాజాసింగ్ పై నమోదు చేసిన కేసులు

ఎమ్మెల్యే రాజాసింగ్ కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టారంటూ ఐపీసీ ( IPC) సెక్షన్ 153(A) కింద  కేసు నమోదు చేశారు. అలాగే మత విశ్వాసాలను కించపర్చినందుకు సెక్షన్ 295-A కింద కేసు..  ప్రకటనల ద్వారా నష్టం కలిగించినందుకు సెక్షన్ 295-A.. బెదిరింపులకు పాల్పడినందుకు సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇవన్నీ బెయిలబుల్ కేసులే నంటూ రాజాసింగ్ న్యాయవాది వాదించగా.. కోర్టు అంగీకరించి బెయిల్ మంజూరు చేసింది. 

నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై కేసు నమోదు కావడంతో ఇవాళ ఉదయం హై డ్రామా నడిచింది. ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసుకున్న పోలీసులు  రాజాసింగ్ ను అరెస్ట్ చేసి బొల్లారం పోలీసు స్టేషన్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అరెస్టు విషయం తెలియడంతో భారీ సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు రాజాసింగ్ అరెస్ట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరో వైపు ఎంఐఎం కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. కోర్టులో వాదనలు.. జరుగుతుండగా.. కోర్టు వద్దకు చేరుకున్న బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.  దీంతో పోలీసులు లాఠీలకు పని కల్పించారు. ఇరువర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. 

రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు

మరో వైపు  పలు రాష్ట్రాల్లో రాజాసింగ్ పై  కేసులు నమోదు కావడంతో  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ పై అధిష్టానం వేటు వేసింది. బీజేపీ నుంచి రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది.