అది మఠం కాదు.. ఆలయమే..నాంపల్లిలోని శ్రీరామ్‌ హనుమాన్‌ మఠం కేసులో హైకోర్టు తీర్పు

అది మఠం కాదు.. ఆలయమే..నాంపల్లిలోని శ్రీరామ్‌ హనుమాన్‌ మఠం కేసులో హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ నాంపల్లిలోని హనుమాన్‌ ఆలయం మఠం కాదని, ఆలయమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 1989లోనే ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసిందని తేల్చి చెప్పింది. హనుమాన్‌ ఆలయాన్ని ‘మఠం’గా గుర్తించాలని, ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ శ్రీరామ్‌ హనుమాన్‌ మఠ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. 

1989లో ఆలయంగా గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్, ప్రాంతీయ జాయింట్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్, వాటిని సమర్థిస్తూ ప్రభుత్వం 2013లో ఇచ్చిన మెమోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో శ్రీరామ్‌ హనుమాన్‌ మఠ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ కె.శరత్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 1995లో రాంబరోస్‌ దాస్‌ను మహంత్‌గా గుర్తిస్తూ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారని, ఇది మఠమే అనడానికి ఇదే నిదర్శనమన్నారు. 

ప్రభుత్వ న్యాయవాది భూక్యా మంగీలాల్‌ నాయక్‌ వాదనలు వినిపిస్తూ.. దీనిని ఆలయంగా గుర్తిస్తూ ప్రభుత్వం 1989లోనే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిందని గుర్తు చేశారు. అక్కడ 1937లోనే పాత హనుమాన్‌ ఆలయం, సీతారామ లక్ష్మణ ఆలయంతో పాటు శివాలయం ఉండేవని తెలిపారు. ఇరు వాదనలను విన్న న్యాయమూర్తి ఈ వ్యవహారానికి సంబంధించి ఒరిజినల్‌ రికార్డులను తెప్పించి పరిశీలించి తీర్పు వెలువరించారు.