
‘నాంపల్లి వ్యాక్సిన్’ ఘటనపై కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు విచారణ మొదలెట్టారు . ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్లు దీపక్ , వికాస్ మదాన్, కృష్ణ కుమార్ ల ఉన్నతాధికారుల బృందం (ఇమ్యు నైజేషన్ విభాగం) శుక్రవారం మధ్యాహ్నం ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ తో సమావేశమై ఘటన గురించి ఆరా తీసింది. పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చిన నాంపల్లి పీహెచ్ సీ సిబ్బందిని విచారించి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై నిలోఫర్ వైద్యులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తర్వాత చుక్కల మందుకు బదులు ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తుండటంపై వారు ఆగ్రహించినట్టు తెలిసింది. పారాసిటమాల్, గురువారం పిల్లలకిచ్చిన ట్రమడాల్ ట్యాబ్లెట్లను పరీక్షించి వ్యాక్సిన్ శాంపిళ్లు, ట్యాబ్లెట్లను వెంట తీసుకెళ్లినట్టు సమాచారం.
ట్రమడాల్ ఉపసంహరణ
వ్యాక్సిన్ ఘటనపై 11లోగా పూర్తి నివేదికివ్వాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ను ప్రిన్సి పల్ సెక్రటరీ శాంతకుమారి ఆదేశించారు. రాష్ర్టం లోని పీహెచ్ సీలు, బస్తీ దవాఖానల్లోని ట్రమడాల్ ట్యాబ్లెట్లు , ఇంజక్షన్లను రెండ్రోజుల్లో వెనక్కి తెప్పించాలని, వాటి పంపిణీ నిలిపేయాలని ఫ్యామిలీ వెల్ ఫేర్ కమిషనర్ కు చెప్పారు. పారాసిటమాల్, ట్రమడాల్ ట్యాబ్లెట్లు ఒకే రంగులో, ఒకే సైజులో ఉన్నందునే గురువారం నాటి ఘటనలో సిబ్బంది పొరపాటున ఓ ట్యాబ్లెట్‌కు బదులు మరొకటి ఇచ్చారు . దీంతో ట్రమడాల్ సైజ్ , రంగు మార్చాలని టీఎస్ ఎంఐడీసీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 18లోగా రాష్ర్టవ్యాప్తంగా అన్ని పీహెచ్ సీల్లో పారాసిటమాల్ సిరప్ , డ్రాప్స్ అందుబాటులో ఉంచాలంది. పిల్లల వ్యాక్సినేషన్‌లో నిర్లక్ష్యం వహించిన నాంపల్లి పీహెచ్ సీ హెల్త్ సూపర్ వైజర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముగ్గురు ఏఎన్‌ఎంలు, ఫార్మసిస్ట్‌తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసి వారిని విధుల నుంచి తొలగించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.
వ్యాక్సినేషన్ విధానంపై కమిటీ
వ్యాక్ సినేషన్ కు ప్రస్తు తం అవలంబిస్తున్న విధానం సమీక్షకు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఇమ్యునైజేషన్ , ఓపీ రికార్డుల మెయింటెనెన్స్, మందుల నిర్వాహణ పద్ధతులను పరిశీలించి ఈ నెల 18లోగా నివేదికివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
సిబ్బందిపై కేసు
పిల్లలకు టీకాలిచ్ చిన వైద్య సిబ్బందిపై హాబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆస్పత్రి పాలైన చిన్నారి ఎండీ ఉమర్ తండ్రి పోలీసులకు ఫిర్యా దు చేశారు . మరోవైపు నిలోఫర్ లో 35 మంది చిన్నారులకు చికిత్స సాగుతోంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.