మొయినాబాద్ ఫాం హౌస్ కేసు : నందకుమార్, రోహిత్ రెడ్డి లావాదేవీలపై ఈడీ ఆరా

మొయినాబాద్ ఫాం హౌస్ కేసు : నందకుమార్, రోహిత్ రెడ్డి లావాదేవీలపై ఈడీ ఆరా

ఫాంహౌస్ కేసులో నిందితుడైన నందకుమార్ రెండో రోజు ఈడీ విచారణ ముగిసింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్లు సుమిత్ గోయల్, దేవేంద్ర కుమార్, వీర నారాయణ రెడ్డి నేతృత్వంలో విచారణ కొనసాగింది. దాదాపు ఐదున్నర గంటలకుపైగా అధికారులు నందకుమార్ ను ప్రశ్నించి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. నందకుమార్, 7 హిల్స్ మానిక్ చంద్ గుట్కా వ్యాపారి అవాల, అభిషేక్ మధ్య రూ. 7 కోట్ల 50 లక్షల లావాదేవీలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీల గురించి సమాచారం సేకరించినట్లు సమాచారం. మొయినాబాద్ ఫాం హౌస్ వ్యవహారంలో రూ.100 కోట్ల గురించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నందకుమార్ చెప్పిన వివరాలన్నింటినీ సీల్డ్ కవర్ లో నాంపల్లి కోర్టుకు సమర్పించనున్నారు.

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నిందితుడు నందకుమార్‌ను రెండు రోజులపాటు విచారించేందుకు న్యాయస్థానం ఈడీ అధికారులకు అనుమతించింది. కేసులో పెద్ద మొత్తంలో నిధుల మళ్లింపు జరిగినట్లు అనుమానం ఉందన్న కారణంతో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, అభిషేక్‌ ఆవాలాను ఈడీ గతంలోనే విచారించింది. ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్‌ను చంచల్ గూడ జైలులోనే విచారించారు.