తెలంగాణ పాలిటిక్స్లోకి బాలయ్య.. జూనియర్ ఎన్టీఆర్ తో బీఆర్ఎస్ కౌంటర్

తెలంగాణ పాలిటిక్స్లోకి బాలయ్య.. జూనియర్ ఎన్టీఆర్ తో బీఆర్ఎస్ కౌంటర్

హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్ లో బాలకృష్ట యాక్టీవ్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఆయనకు కౌంటర్ గా జూనియర్ ఎన్టీఆర్ చరిష్మాను వాడుకొనేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఖమ్మం కేంద్రంగానే ఈ పొలిటికల్ ఫైట్ జరగబోతున్నది. టీడీపీ ఇటీవల తెలంగాణలో పార్టీ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఖమ్మం, హైదరాబాద్ లలో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించారు. ఈ తరుణంలో తన బావమర్ది, సినీనటుడు నందమూరి బాలకృష్ణ చంద్రబాబుకు అండగా నిలిచారు.

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మినీ మహానాడులో తెలంగాణలో ప్రజా సేవ చేయనున్నట్టు ప్రకటించి తన ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ‘తెలంగాణ ప్రజల గుండెల్లో టీడీపీకి ఓ సుస్థిర స్థానం ఉంది.. ఇక్కడ టీడీపీకి పూర్వ వైభవం తీసుకు వచ్చే బాధ్యత మనపై ఉంది. ఇందుకోసం ప్రతిఒక్క టీడీపీ కార్యకర్త కృషి చేయాలి.. దాని కోసం నేను సైతం మీతోనే ఉంటా.. తెలంగాణలోనూ టీడీపీ ఉంటుంది’రాబోయే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని కార్యకర్తలకు బాలయ్య పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకొనేందుకు బీఆర్ఎస్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం ట్యాంక్ బండ్ లో దివంగత సీఎం నందమూరి తారకరామారావు 36 అడుగుల భారీ విగ్రహం ఒకటి ప్రతిష్టించబోతున్నారు. ఈ నెల 28న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మానికి ఆహ్వానించారు. ఈ అంశం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.

2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 2014 లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆయన పాలిటిక్స్ జోలికి వెళ్లలేదు. ఇటీవల కాలంలో ఏపీలో చంద్రబాబు, లోకేశ్ నిర్వహించిన పాదయాత్రల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రావాలనే నినాదాలు వినిపించాయి. దీనిపై అటు చంద్రబాబు గానీ, ఇటు బాలకృష్ణగానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీ ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్ కావడంతో గులాబీ టీం కొత్త ఎత్తుగడకు తెరతీసింది. ఖమ్మం వేదికగా సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గానికి ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తో విగ్రహావిష్కరణ చేయించనుంది. తద్వారా టీడీపీ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.