ఎన్టీఆర్ పేరును తొలిగించడం..తెలుగుజాతిని అవమానించడమే

ఎన్టీఆర్ పేరును తొలిగించడం..తెలుగుజాతిని అవమానించడమే

డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించడాన్ని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్ పేరును తొలిగించడం యావత్ తెలుగు జాతిని అవమానించినట్లేనని.. ఆ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 1986 లో ఈ యూనివర్సిటీని ఎన్టీఆర్ స్థాపించారని..అటువంటి వ్యక్తి పేరును ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీదున్న అభిమానంతో డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారని తెలిపారు. ఇప్పుడు ఆయన కొడుకు జగన్ ఆ పేరునే తొలగించడం దురదృష్టకరమన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది ఏపీ ప్రభుత్వం. వైద్య రంగ సేవలకు గుర్తుగానే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టామని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాజకీయాలు కాకుండా ప్రజలకు అందించిన సేవలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ దివాళాకోరు తనానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి.. వైఎస్సాఆర్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. చేతనైతే కొత్త సంస్థలను నిర్మించాలని...పేరు మార్పుతో జగన్ సర్కార్ కు పేరు రాదన్నారు.