Taraka Ratna: నందమూరి తారకరత్న కన్నుమూత

Taraka Ratna: నందమూరి తారకరత్న కన్నుమూత

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన మూడు వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి  ఇవాళ(శనివారం) రాత్రి కన్నుమూశారు.   

23 రోజులుగా ఆస్పత్రిలోనే..

జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. లోకేష్‌ తో కలిసి పాదయాత్ర చేస్తుండగా తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన ట్రీట్ మెంట్ కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.  అక్కడ విదేశీ వైద్య డాక్టర్లు చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 23  రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందిన తారకరత్న ఇవాళ తుదిశ్వాస విడిచారు.  దీంతో నందమూరి  అభిమానులు, టీడీపీ శ్రేణులు తారకరత్న మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.  

ఒకేసారి 9 సినిమాలతో ప్రపంచ రికార్డ్

తారకరత్న 1983 ఫిబ్రవరి 22 హైదరాబాద్ లో జన్మించారు. తారకరత్న తండ్రి నందమూరి మోహన కృష్ణ. తారకరత్న కే.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో 2002లో  వచ్చిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తారకరత్న 2002లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. 2009 లో వచ్చిన అమరావతి చిత్రానికి గానూ తారకరత్నకు నంది అవార్డ్ వచ్చింది. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 23 చిత్రాల్లో నటించారు. ఇంకా రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 9 హవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. తారకరత్నకు భార్య అలేఖ్య, కూతురు నిషిక ఉన్నారు.  2012లో అలేఖ్యతో తారకరత్న వివాహం అయ్యింది.