
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని చైతన్యపురిలో చుతుర్ముఖ నందీశ్వర లింగాన్ని గుర్తించినట్లు చరిత్ర కారుడు ద్యావనపల్లి సత్యనారాయణ తెలిపారు. దాదాపు 2 అడుగుల చదరపు గ్రానైట్ రాతి స్లాబ్‌పై 4 దిక్కుల్లో ఒక్కొక్కటి 8 అంగుళాల పరిమాణంలో నందులను చెక్కారు. వాటి మధ్యలో శివలింగం, దాని చుట్టూ అభిషేక జలాన్ని బయటకు పంపే పానవట్టం చెక్కారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిల్పం తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అతి ప్రాచీనమైన, అరుదైన చతుర్ముఖ నందీశ్వర లింగం అని ఆయన పేర్కొన్నారు.
2వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 2వ శతాబ్దం మధ్య కాలానికి చెందిన ఏకశిలా శివలింగాలు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా గుడిమల్లం, అలాగే తెలంగాణలోని గద్వాల జిల్లా రంగాపురం, ఘూమకొండ ప్రాంతాల్లో బయట పడ్డాయని తెలిపారు. ఇది నాలుగు దిక్కుల్లో నందులను కలిగి ఉండటమే ఈ నందీశ్వర లింగం ప్రత్యేకత అని ఆయన వెల్లడించారు. ఈ చతుర్ముఖ నందీశ్వర లింగాన్ని సంరక్షించేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.