
తెలంగాణ ఎన్నికల వేళ..కాంగ్రెస్ కు షాక్ తగిలింది. మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఇంచార్జి నందికంటి శ్రీధర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్‌లో చేరడంతో అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేసినట్లు లేఖలో తెలిపారు.
లేఖలో ఏముందంటే..
నందికంటే శ్రీధర్ అనే నేను..బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. నేను 1994 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. పార్టీలు మారకుండా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నా. పార్టీకి ఎంతో సేవ చేశాను. 2018లో టికెట్ వస్తుందని భావించాను. కానీ పొత్తుల కారణంగా టికెట్ రాలేదు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం కుటుంబానికి ఒకే సీటు నిర్ణయాన్ని స్వాగతించి.. ఈ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందని భావించా. కానీ ఇప్పుడు మల్కాజిగిరి, మెదక్ టికెట్లను ఒకే కుటుంబానికి కేటాయించారు. ఎన్నో ఏళ్ల నుంచి మల్కాజిగిరికి చెందిన కాంగ్రెస్ నేతలు.. మైనంపల్లి హనుమంతరావుతో పోరాడారు. వారిపై అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదు. నేడు అదే వ్యక్తిని కాంగ్రెస్ లో చేర్చుకుని మాకు అన్యాయం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఇద్దరికి టికెట్లు ప్రకటించి కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది. ఓసీ అభ్యర్థికి సీటు ప్రకటించి, బీసీ అభ్యర్థులకు అన్యాయం చేసింది. అందుకే నేను డీసీసీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. అని నందికంటి శ్రీధర్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ALSO READ : మోదీ అంటే విశ్వాసం... కేసీఆర్ అంటే మోసం..
సెప్టెంబర్ 28వ తేదీన మైనంపల్లి హన్మంతరావు, తన కుమారుడితో పాటు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ స్థానాలను మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడికి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది.