CAA అవసరమని ప్రతిపక్షాలకు పాకిస్థానే సమాధానమిచ్చింది

CAA అవసరమని ప్రతిపక్షాలకు పాకిస్థానే సమాధానమిచ్చింది

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అవసరాన్ని ప్రతిపక్షాలకు పాకిస్థానే సమాధానపరిచిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. పాకిస్థాన్‌లో ఉన్న గురునానక్ జన్మస్థలంలోని నాన్‌కానా సాహెబ్ గురుద్వారాపై జరిగిన దాడే ఆ దేశంలో మైనారిటీలకు ఏపాటి రక్షణ ఉందన్నదానికి నిదర్శనమని అన్నారు. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియా గాంధీ, ఆప్ చీఫ్ కేజ్రీవాల్, ఇతర ప్రతిపక్ష నేతలు CAAను వ్యతిరేకిస్తున్నారని, వీళ్లంతా పాకిస్థాన్‌లో సిక్కుల గురుద్వారాపై జరిగిన దాడి గురించి ఓ సారి తెలుసుకోవాలని హితవు చెప్పారు అమిత్ షా. పాక్ చేసిన ఆ దుర్మార్గమైన పనే CAA అవసరమేంటన్న దానికి సమాధానమన్నారు. కానీ, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా పౌరసత్వ చట్టం విషయంలో లేనిపోని అవాస్తవాలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.

భారత మైనారిటీలకు ఈ చట్టంతో ఏ మాత్రం నష్టం లేదని, దేశంలోని ఏ ఒక్కరి పౌరసత్వాన్ని ఇది తొలగించదని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. నాన్‌కానా సాహెబ్‌పై జరిగిన దాడిని గమనించాలని, మన సిక్కు సోదరులు భారత్‌కు కాకుండా మరెక్కడికి వెళ్లగలరని ప్రశ్నించారు. పాక్‌లో మత హింస ఎదుర్కొంటున్న మైనారిటీలకు భారత్‌కు రావడం ఒక్కటే దారి అన్నారు.

ఢిల్లీలో ఐదేళ్ల క్రితం అబద్ధాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించి ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు అమిత్ షా. ఎవరైనా తప్పుడు హామీలతో ఒక్కసారే ప్రజల్ని మోసం చేయగలరని, మరోసారి కేజ్రీవాల్ విజయం సాధించలేరని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు.