మీరు తాగే చిన్న ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల నుండి వచ్చే నానోప్లాస్టిక్‌లు మనిషి ఆరోగ్యానికి ముఖ్యమైన జీవ వ్యవస్థలను నేరుగా దెబ్బతీస్తాయని ఒక భారతీయ అధ్యయనం స్పష్టం చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ (DST) ఆధ్వర్యంలో పనిచేసే మొహాలీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ (INST) ఈ పరిశోధన చేసింది.
ఆహారం, నీటిలో ఉన్న ఈ చిన్న నానోప్లాస్టిక్‌లు మనుషుల శరీరంలో ఎంతవరకు హాని చేస్తాయో ఇప్పటివరకు బయటపడలేదు. సాధారణంగా ప్లాస్టిక్‌లు పర్యావరణాన్ని లేదా మన కణజాలాలను ఎలా పాడు చేస్తాయో చాలా పరిశోధనలు చెప్పాయి. కానీ, మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పేగులోని మంచి బ్యాక్టీరియాపై వాటి డైరెక్ట్ ప్రభావం గురించి పెద్దగా తెలియదు.
ALSO READ | ఇంట్లో .. కుండీల్లో మొక్కలు పెంచుతున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
INST లోని ప్రశాంత్ శర్మ, సాక్షి దగారియా నేతృత్వంలోని బృందం ఈ నానోప్లాస్టిక్‌ల వల్ల మనిషి ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఉందని మొట్టమొదటిసారి స్పష్టమైన ఆధారాలను కనిపెట్టింది. దీర్ఘకాలికంగా ఈ నానోప్లాస్టిక్‌లకు గురైతే... పేగులో మంచి బ్యాక్టీరియా (Microbiome) దెబ్బతింటుంది. ఎర్ర రక్త కణాలు (Red Blood Cells) దెబ్బతింటాయి. DNA దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.
పరిశోధకులు వారి పరిశోధనను నానోస్కేల్ అడ్వాన్సెస్ అనే జర్నల్‌లో ప్రచురించారు. ప్రతిరోజు వాడే ప్లాస్టిక్‌ల నుండి వచ్చే నానో-ప్లాస్టిక్‌లు పేగు ఆరోగ్యం, రక్తం, కణాల పనితీరును అడ్డుకుంటాయని వారు స్పష్టం చేశారు.
ఈ పరిశోధన కేవలం మనుషుల ఆరోగ్యానికే కాదు, వ్యవసాయం, పోషకాహారం, పర్యావరణ అధ్యయనాలలో కూడా ప్లాస్టిక్ కాలుష్యం, సూక్ష్మజీవుల సమతుల్యతపై అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
