న్యూఢిల్లీ: ఆసియా కప్ ట్రోఫీని అందజేసే అంశంపై వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ట్రోఫీని అక్కడి నుంచి అబుదాబిలోని ఓ గుర్తు తెలియని ప్రదేశానికి పీసీబీ చైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ తరలించారని సమాచారం. ఇటీవల బీసీసీఐ అధికారి ఒకరు ఏసీసీ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించినప్పుడు ఈ విషయం బయటపడింది.
దీనిపై ఆరా తీయగా అబుదాబిలో నఖ్వీకి సంబంధించిన వారి వద్ద ఉందని సిబ్బంది ఆఫీస్ సిబ్బంది వెల్లడించారు. ‘ట్రోఫీ ఏసీసీ కార్యాలయంలో లేదు. నఖ్వీ ఆదేశాల మేరకు దాన్ని అబుదాబిలోని ఓ ప్రదేశానికి తరలించారు. అది అతని కస్టడీలోనే ఉంది. ట్రోఫీ తరలించే విషయాన్ని ఎవరూ బహిర్గతం చేయలేదు’ అని ఏసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
ఆసియా కప్ ఫైనల్ గెలిచిన తర్వాత నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి టీమిండియా నిరాకరించింది. సెప్టెంబర్ చివరి వారంలో జరిగిన ఏసీసీ సమావేశంలో ఈ అంశంపై నఖ్వీ బీసీసీఐకి క్షమాపణలు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ దీన్ని ఖండించి నఖ్వీ ఆ తర్వాత జరిగిన చర్చల్లో దుబాయ్‌లో ఇండియన్ ప్లేయర్లు వచ్చి స్వీకరిస్తే ట్రోఫీని అందజేస్తానని వెల్లడించాడు.
దీనికి బీసీసీఐ ఒప్పుకోలేదు. ఈ అంశంపై ఐసీసీ వద్ద తేల్చుకుంటామని ఇండియన్ బోర్డు స్పష్టం చేసిన నేపథ్యంలో ట్రోఫీని అక్కడి నుంచి తరలించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఐసీసీ ఈ విషయాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
