ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామలపై మొదటిసారిగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. ఈ మేరకు ఆమె ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు భువనేశ్వరి. ‘నాకు జరిగిన అవమానం మీ తల్లి, తోబుట్టవు, కూతురికి జరిగినట్లు భావించారు. నాకు జరిగిన అవమానం మరొకరికి జరగకూడదు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతీ ఒకరు కృషి చేయాలి. చిన్నతనం నుంచే అమ్మ నాన్న మమ్మల్ని విలువలతో పెంచారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవరూ కూడా వ్యవహరించకూడదు’ అంటూ లేఖలో పేర్కొన్నారు భువనేశ్వరి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నేతల తీరుపై టీడీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబుతో పాటు మిగిలిన టీడీపీ నేతలు కూడా సభను వదిలి బయటకు వచ్చేశారు. సీఎం అయిన తర్వాతే తిరిగి అసెంబ్లీకి వస్తానంటూ.. చంద్రబాబు ఆవేశంతో మాట్లాడారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏ విషయంలో జోక్యం చేసుకోని తన సతీమణిని కూడా రాజకీయాల్లోకి లాగడంపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై నారా కుటుంబం సైతం మీడియా సమావేశం నిర్వహించింది. వైసీపీ తీరు మార్చుకోవాలని సూచించింది. సినీ నటుడు బాలకృష్ణ అయితే వైసీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు.