బెజ్జంకిలో ఘనంగా నరసింహస్వామి రథోత్సవం

బెజ్జంకిలో ఘనంగా నరసింహస్వామి రథోత్సవం

బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జరుగుతున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను రథంపైకి తీసుకొచ్చి ప్రత్యేక హోమం, దిష్టికుంభం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామి వారి రథాన్ని  బెజ్జంకి గుట్ట చుట్టూ తాళ్లతో లాగారు. రథం పైకి కోళ్లను విసిరేసి మొక్కులు తీర్చుకున్నారు. 

సంతానం కలగని మహిళలు ఆండాళ్లు అమ్మవారికి ఒడి బియ్యం పోశారు. అనంతరం కాలభైరవుడిని  దర్శించుకుని మొక్కులు చెల్లించారు. మహారాష్ట్ర, సోలాపూర్, భీమండి, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి లక్షకు పైగా భక్తులుస్వామివారి దర్శనం కోసం వచ్చారు. బెజ్జంకి గ్రామానికి చెందిన పూర్మ అచ్చిరెడ్డి 2006లో రూ.4 లక్షలతో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రథాన్ని చేయించారు. ప్రస్తుతం రూ.లక్ష ఖర్చు చేసి రథానికి రంగులు వేయించారు. హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి, వివిధ పార్టీల నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు.