రేపు దివ్యాంగుల కోసం నారాయణ్ సేవా సంస్థాన్ క్యాంప్

రేపు దివ్యాంగుల కోసం నారాయణ్ సేవా సంస్థాన్ క్యాంప్

హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల సంక్షేమం కోసం నారాయణ్ సేవా సంస్థాన్ ఆదివారం లింబ్, కాలిపర్స్ మెజర్​మెంట్ ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నదని సంస్థ కో ఆర్డినేటర్ భగవాన్ ప్రసాద్ గౌర్ ప్రకటించారు. ఉదయ్​పూర్​కు చెందిన తమ సంస్థ జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నదని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్​లో విశాక ఇండస్ట్రీస్ జేఎండీ, కాంగ్రెస్ లీడర్ గడ్డం వంశీకృష్ణ చేతుల మీదుగా క్యాంప్​కు సంబంధించిన బ్రోచర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ గౌర్ మాట్లాడారు. ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ సంస్థ నిస్వార్థంగా కృషి చేస్తున్నదన్నారు.

39 ఏండ్లుగా దివ్యాంగుల కోసం పని చేస్తున్నదని వివరించారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కింగ్​కోఠిలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ ప్యాలెస్ హాల్, నెదర్ సెయింట్ జోసెఫ్ స్కూల్​లో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆధార్ కార్డు, హ్యాండిక్యాప్ సర్టిఫికెట్, వైకల్యాన్ని తెలిపే 2 ఫొటోలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్ ప్రశాంత్ అగర్వాల్, క్యాంప్ ఇన్​చార్జ్ నరేంద్ర సింగ్ చౌహాన్, హైదరాబాద్ బ్రాంచ్ కో-ఆర్డినేటర్ అల్కా చౌదరి, హైదరాబాద్ శాఖ కార్యవర్గ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ దమ్రాణి, అభయ్ చౌదరి, సామాజిక కార్యకర్త జస్మత్ భాయ్ పటేల్, రిదేశ్ జాగిర్దార్ పాల్గొన్నారు.