మా ఆయన వారానికి 80 నుంచి 90 గంటలు పని చేశారు : సుధా నారాయణమూర్తి

మా ఆయన వారానికి 80 నుంచి 90 గంటలు పని చేశారు : సుధా నారాయణమూర్తి

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని సూచించిన  తర్వాత చర్చకు దారితీసింది.   ఈ విషయంపై ఆయన భార్య సుధా మూర్తి స్పందించారు. 

భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోటీపడాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ 3వన్4 క్యాపిటల్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి ఇలా మాట్లాడారు.  

 14వ టాటా లిట్ ఫెస్ట్‌లో రచయిత్రి హోదాలో ముంబై వెళ్లిన  సుధామూర్తి   ఆదివారం  ( అక్టోబర్ 29) నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (NCPA)లో ఫుల్ హౌస్ టాక్ సెషన్‌లో పాల్గొన్నారు.తన భర్త  నారాయణ మూర్తి జీవితం గురించి మాట్లాడుతూ నారాయణమూర్తి  ఎలా కష్టపడతారో తెలిపారు. ఆయన  వారానికి 80 నుండి 90 గంటలు పని చేశారని వివరించారు.  వారి వివాహం జరిగి 45 సంవత్సరాలు అయిందని.. ఒకరికొకరు మద్దతుగా  ఉంటూ జీవనం కొనసాగించామని తెలిపారు.  తాను తన భర్త నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని సుధామూర్తి తెలిపారు. 

భారతదేశం పని ఉత్పాదకత ప్రపంచవ్యాప్తంగా అత్యల్పంగా ఉందని నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చైనా వంటి దేశాలతో పోటీ పడటానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసిన విధంగా మన దేశ యువత కూడా అదనపు గంటలు పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భారత్ లో మన పని ఉత్పాదకతను మెరుగుపరుచుకోకపోతే, ప్రభుత్వంలో అవినీతిని ఏదో ఒక స్థాయిలో తగ్గించకపోతే, ఈ నిర్ణయం తీసుకోవడంలో మన బ్యూరోక్రసీలో జాప్యాన్ని తగ్గించకపోతే అద్భుతమైన పురోగతి సాధించిన దేశాలతో మనం పోటీ పడలేమని చెప్పారు. 

 అయితే నారాయణ మూర్తి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరేమో విమర్శిస్తున్నారు. నెక్ట్స్ మరో 10 గంటలు పెంచుతారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. చాలా మంది బిజినెస్ లీడర్లు, ఎంటర్‌ప్రెన్యూర్లు .. మూర్తి ఆలోచనను వ్యతిరేకిస్తున్నారు. ఎక్కువ గంటలు పనిచేయడం పక్కనబెడితే.. పనిలో నాణ్యత గురించి ముందుగా మాట్లాడాలని చెప్పుకొస్తున్నారు. కేవలం పని గంటలు పెంచితేనే .. ఉత్పాదకత పెరగదని అన్నారు అప్‌గ్రాడ్ ఫౌండర్ రోనీ స్క్రీవాలా. మంచి స్కిల్స్, పాజిటివ్ వర్క్ ఎన్విరాన్‌మెంట్, ఫెయిర్ ప్లే కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. పని గంటల కంటే క్వాలిటీనే ముఖ్యమని వివరించారు.