హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల్లో భావవ్యక్తీకరణ, ఆత్మవిశ్వాసం, వక్తృత్వ నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా నారాయణ స్కూల్స్ ఆధ్వర్యంలో ‘మాస్టర్ ఆరిటేటర్–సీజన్ 7’ పోటీలను నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు, విమర్శనాత్మక విశ్లేషణ సామర్థ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పోటీలను 1 నుంచి 5వ తరగతి, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రెండు విభాగాలుగా నిర్వహించారు.
మొదటి విభాగంలో 2,600 మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా, 84 మంది గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించారు. వీరిలో 18 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. 6 నుంచి 9వ తరగతి విభాగంలో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని 12 బ్రాంచీల నుంచి 3,500 మందికి పైగా విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఫైనల్స్‌కు చేరిన 96 మందిలో 34 మంది విజేతలుగా నిలిచారు.
‘ఇంటర్నెట్ లేని జీవితం’, ‘పాఠ్యప్రణాళికలో కళలు, సంగీతం ప్రాముఖ్యత’, ‘మెరుగైన పాఠశాల కోసం నా ఆలోచనలు’, ‘చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు’ తదితర అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేశారు. విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, సమాజంపై అవగాహన పెంచుకుని, తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నారాయణ గ్రూప్ డైరెక్టర్ డా. పి. సింధూర నారాయణ తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి సంస్థ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
