ఆశ్రమ పాఠశాలల్లో స్టూడెంట్లకు అస్వస్థత ..మోర్గీ మోడల్‌‌ కాలేజీలో ఫుడ్ పాయిజన్‌‌.. 11 మందికి వాంతులు

ఆశ్రమ పాఠశాలల్లో స్టూడెంట్లకు అస్వస్థత ..మోర్గీ మోడల్‌‌ కాలేజీలో ఫుడ్ పాయిజన్‌‌.. 11 మందికి వాంతులు
  • పెంబి ఆశ్రమ పాఠశాలలో పసుపు, వేపాకు కలిపిన బియ్యం తిన్న స్టూడెంట్లు.. 
  • 14 మందికి అస్వస్థత

నారాయణ్‌‌ఖేడ్‌‌/పెంబి, వెలుగు : మోడల్‌‌ కాలేజీ, ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌‌ పాయిజన్‌‌ జరగడంతో పలువురు స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా నాగల్‌‌గిద్ద మండలంలోని మోర్గి మోడల్‌‌ కాలేజీలో 70 మంది స్టూడెంట్లు ఉన్నారు. వీరికి ఆదివారం రాత్రి చికెన్‌‌ పెట్టారు. చికెన్‌‌ తిన్న తర్వాత 11 మంది స్టూడెంట్లు రాత్రి 10 గంటలకు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. గమనించిన వాచ్‌‌మెన్‌‌ స్టూడెంట్లను నారాయణఖేడ్‌‌ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌‌కు తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎనిమిది మంది నార్మల్‌‌గా ఉండడంతో వారిని డిశ్చార్జ్‌‌ చేయగా.. మరో ముగ్గురికి ట్రీట్‌‌మెంట్‌‌ చేస్తున్నట్లు హాస్పిటల్‌‌ సూపరింటెండెంట్‌‌ రమేశ్‌‌ తెలిపారు. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాస్పిటల్‌‌కు వచ్చి స్టూడెంట్స్‌‌తో మాట్లాడారు. 

పసుపు, వేపాకు కలిపిన బియ్యం తినడంతో...

పెంబి, వెలుగు : ఆశ్రమ పాఠశాలలో ఉంటున్న ఓ స్టూడెంట్‌‌ డబ్బులు పోవడంతో.. దొంగను పట్టుకునేందుకు పసుపు, వేపాకు కలిపిన బియ్యం తినిపించింది. దీంతో 14 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నిర్మల్‌‌ జిల్లా పెంబి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... స్కూల్‌‌లో ఉంటున్న ఓ విద్యార్థికి సంబంధించిన రూ. 100 కనిపించకుండా పోయాయి. దీంతో డబ్బులు దొంగిలించిన వారిని పట్టుకునేందుకు.. మూఢనమ్మకంతో పసుపు, వేపాకు కలిపిన బియ్యాన్ని తోటి విద్యార్థులకు తినిపించింది. వాటిని తిన్న 14 మంది అస్వస్థతకు గురయ్యారు. గమనించిన టీచర్లు వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. వారికి ట్రీట్‌‌మెంట్‌‌ చేసిన అనంతరం తిరిగి స్కూల్‌‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న నిర్మల్‌‌ డీటీడీవో అంబాజీ స్కూల్‌‌కు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు. 

మంచిర్యాల ట్రైబర్‌‌ వెల్ఫేర్‌‌ స్కూల్‌‌లో...

నస్పూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రం సాయికుంటలోని గిరిజన ఆశ్రమ బాలికల హైస్కూల్‌‌కు చెందిన పలువురు స్టూడెంట్లు అస్వస్థతకు గురికాగా.. మంచిర్యాల ఎంసీహెచ్‌‌కు తరలించారు.మందమర్రి మండలానికి రేవతి, తరుణి అక్కాచెల్లెళ్లు. తరుణి ఎనిమిదో తరగతి, రేవతి ఆరో తరగతి చదువుతున్నారు. వీరు మూడు రోజుల కింద అనారోగ్యానికి గురికాగా... ఆఫీసర్లు సోమవారం మంచిర్యాల ఎంసీహెచ్‌‌కు తరలించారు. 

రేవతి గొంతు నొప్పితో బాధపడుతూ సరిగా మాట్లాడలేకపోతుండగా.. తరుణి సాధారణ జ్వరంతో ఇబ్బంది పడుతోంది. ఇద్దరు స్టూడెంట్లకు మెరుగైన ట్రీట్‌‌మెంట్‌‌ అందిస్తున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్‌‌ కుమార్‌‌ తెలిపారు. స్కూల్‌‌లో పుడ్‌‌ పాయిజన్‌‌ జరిగిందని సోషల్‌‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కలెక్టర్ చెప్పారు. అసత్య ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీఎస్‌‌యూ నాయకుడు శ్రీకాంత్‌‌, తదితరులు స్డూడెంట్లను పరామర్సించారు.