నారాయణపురం రైతుల పాస్ బుక్ కష్టాలు  

నారాయణపురం రైతుల పాస్ బుక్ కష్టాలు  
  • భూములను ధరణిలో 
  • ప్రభుత్వం ఎక్కించినా.. 
  • పట్టాదారుల పేర్లు రాయలే
  • ఆ పేర్ల స్థానంలో ‘అడవి’ అని చేర్చడంతో రైతుల ఆందోళన
  • తీరని నారాయణపురం రైతుల పాస్ బుక్ కష్టాలు  

హైదరాబాద్, వెలుగు: ఐదేండ్లుగా ఎడతెగని నిరీక్షణ, అనేక ఆందోళనలు, నిరసనల తర్వాత ఎట్టకేలకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతుల భూములు ధరణిలో కనిపించాయి. కానీ, పట్టాదారు పేరు స్థానంలో రైతు పేరుకు బదులు ‘అడవి’ అని, తండ్రి పేరుకు బదులు ‘అడవి’ అని చూపిస్తుండడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. నారాయణపురంలోని 1,827 ఎకరాల సాగు భూమిని భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఫారెస్ట్ భూముల జాబితాలో కలిపేశారు. అంతేగాక ధరణి పోర్టల్ లో ఈ గ్రామానికి చెందిన సర్వే నంబర్లను పక్కనే ఉండే నెల్లికుదురు మండలం చిన్నముప్పారం గ్రామంలో ఉన్నట్లు చూపారు. ఈ సర్వే నంబర్లను తొలగించి నారాయణపురంలో చూపించాలని, రైతులకు కొత్త పాస్ బుక్స్ జారీ చేయాలని గ్రామ ఎంపీటీసీ సభ్యుడు దరావత్  రవి ఆధ్వర్యంలో అనేక సార్లు ఆందోళనలు చేయడంతోపాటు సీఎస్ కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ క్రమంలోనే నిరుడు మే నెలలో కలెక్టర్ స్పందించి.. సర్వే నిర్వహించారు. రైతులకు పాస్ బుక్స్ జారీ చేయాలని సీసీఎల్​ఏకు జూన్ 9న  రిపోర్ట్ ఇచ్చారు. సరిగ్గా ఏడాది తర్వాత ప్రభుత్వం స్పందిం చింది. నారాయణపురం గ్రామానికి చెందిన సర్వే నంబర్లను ఇదే గ్రామ డేటాలో కనిపించేలా మార్పులు చేసింది. ప్రస్తుతానికి నేచర్ ఆఫ్ ల్యాండ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ స్థానాల్లో ఫారెస్ట్​కు బదులు పట్టా భూమిగా మార్పులు చేసినప్పటికీ.. రైతుల పేర్లు ఇంకా మారలేదు. పట్టాదారు కాలమ్​లో అడవి అని, తండ్రి పేరు అడవి అని చూపిస్తుండడంతో పాస్ బుక్స్ ఇస్తారో లేదోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తాము రైతు బంధుతోపాటు పీఎం కిసాన్ పథకం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పాస్ బుక్స్ ఇచ్చి రైతుబంధు, రైతు బీమా మంజూరు చేయాలని కోరుతున్నారు. రైతుబంధుకు అప్లయ్​ చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉండడంతో ఈలోగా పాస్ బుక్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

పాస్​ బుక్​ రాక.. రైతుబంధు, పీఎం కిసాన్​ అందుతలే

నాకు ఆరు ఎకరాల పొలం, చెలక ఉంది. వీటికి పాత పాస్ బుక్ ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన చేసినప్పుడు మా పట్టా భూములను ఫారెస్ట్ భూములుగా చూపించా రు. దీంతో మేం ఆఫీసుల చుట్టూ తిరగడం తో ఇది తమ భూమి కాదని, పట్టా భూమి అని ఫారెస్ట్ శాఖ 2021 ఫిబ్రవరిలో క్లియరెన్స్ ఇచ్చింది. నిరుడే కలెక్టర్ వచ్చి  సర్వే చేయించారు. కానీ ఇప్పటి వరకు పాస్ బుక్స్ రాలేదు. పాస్ బుక్స్ రాక నేను సంవత్సరానికి రైతుబంధు, పీఎం కిసాన్ కలిపి దాదాపు రూ. 60 వేలకుపైగా కోల్పోతున్న.
- దరావత్ వీరన్న, రైతు, నారాయణపురం