
- రెండో స్థానంలో నల్గొండ జిల్లా చింతపల్లి పీఎస్
- జాతీయ స్థాయిలో వరుసగా 14, 24 స్థానాలు
- దేశంలోనే టాప్ రాజస్థాన్‌లోని కలు పీఎస్
- ఉత్తమ సేవలకు అరుదైన గౌరవం
న్యూఢిల్లీ, సంస్థాన్ నారాయణపురం, వెలుగు: రాష్ట్రంలో బెస్ట్ పోలీస్‌స్టేషన్‌గా యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం పీఎస్ ఎంపికైంది. జాతీయ స్థాయిలో 14వ స్థానంలో నిలిచింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‍మెంట్(బీపీఆర్డీ) సంస్థ 2018 గానూ దేశవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్ల పనితీరుపై సర్వే చేసింది. నిర్వహణ, నేరాల నియంత్రణ, ఇన్వెస్టిగేషన్‌లో ఐటీ వినియోగం, ఫిర్యాదులపై స్పందన, ప్రజల భద్రత, సేవా కార్యక్రమాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, మౌలిక వసతులు తదితర అంశాలపై వివరాలు సేకరించింది. వాటిని విశ్లేషించి ర్యాంకులిచ్చింది. ఈ వివరాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‍గౌబీ బుధవారం వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్‌స్టేషన్ రెండో స్థానంలో నిలిచింది. ఈ పీఎస్‌కు దేశవ్యాప్తంగా 24వ స్థానం దక్కింది.
ఒకప్పడు నక్సల్స్ ఏరియా
సంస్థాన్ నారాయపురం పీఎస్ నిజాం కాలంలో దాదాపు 80 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. అప్పట్లో నాకా (పన్నుల) వసూలుకు దీన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత పోలీస్ స్టేషన్‍గా గుర్తించారు.1980 ప్రాంతంలో రాచకొండ కేంద్రంగా నక్సలైట్ల ఉద్యమం నడిచింది. దాదాపు పాతికేళ్లపాటు ఎన్‌కౌంటర్లు, దాడులు, ప్రతి దాడులతో నిత్యం ఈ పోలీస్‌స్టేషన్ వార్తల్లో ఉండేది. అలాంటి పీఎస్ క్రమేణా ప్రజలకు సేవలందించడంలో నంబర్ వన్ స్థానానికి ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చింది. ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండడం, సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రారంభమైంది. యూత్‌ను గైడ్ చేయడం, పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికపై శిక్షణ ఇప్పించడం చేశారు. వీటన్నింటిలో సంస్థాన్ నారాయణపురం పీఎస్ ముందుంది. 2018లో ఈ పీఎస్ పరిధిలో 147 కేసులు నమోదయ్యాయి. వీటిలో 139 పరిష్కారమయ్యాయి. కేవలం 8 కేసులే పెండింగ్‌లో ఉన్నాయి. లోక్ అదాలత్‍లో 47 కేసుల్లో రాజీ కుదిర్చారు.
టాప్ 30లో ఏపీ నుంచి ఐదు
ఆంధ్రప్రదేశ్ విజయనగరంలోని సీతానగరం పీఎస్‌కు జాతీయస్థాయిలో 20వ ర్యాంకు, గుంటూరులోని సందోల్ పీఎస్‌కు 21వ ర్యాంకు, అనంతపురంలోని పుత్లూరు పోలీస్ స్టేషన్‌కు 23 ర్యాంకు, విజయనగరం జిల్లా పార్వతీపురం పీఎస్‌కు 25వ ర్యాంకు, బుదరాయవలస పీఎస్‌కు 30వ ర్యాంకు దక్కాయి.
జాతీయ స్థాయిలో టాప్-3
రాజస్థాన్‌లోని బైకనీర్ జిల్లా కలు పోలీస్‌స్టేషన్ దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అండమాన్ నికోబార్ జిల్లా కాంపబెల్ బే పోలీస్‌స్టేషన్ రెండో స్థానంలో నిలిచింది. వెస్ట్ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లా ఫరక్కా పోలీస్ స్టేషన్ మూడో స్థానంలో నిలిచింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు 2016 నుంచి ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్లకు ర్యాంకులు ఇస్తున్నారు.