యుద్ధానికి రెడీ అయిన పాకిస్తాన్ : అబ్దాలి క్షిపణులను బయటకు తీసి.. టెస్ట్ చేస్తోంది..!

యుద్ధానికి రెడీ అయిన పాకిస్తాన్ : అబ్దాలి క్షిపణులను బయటకు తీసి.. టెస్ట్ చేస్తోంది..!

Abdali Ballistic Missile: ఇప్పటికే ఇండియా పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి పరిస్థితులు దిగజారాయి. ఈ క్రమంలోనే గడచిన నెల చివర్లో భారత్ సైతం క్షిపణి ప్రయోగాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే తాజాగా భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ శనివారం ఉపరితలం నుండి ఉపరితలం వరకు బాలిస్టిక్ క్షిపణి అబ్దాలిని విజయవంతంగా పరీక్షించినట్లు వెల్లడించింది. దీని రేంజ్ 450 కిలోమీటర్లుగా పాక్ వెల్లడించింది. పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్య క్షిపణి దళాలను పర్యవేక్షించే ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ASFC) కింద నిర్వహించిన ఆపరేషనల్ యూజర్ ట్రయల్స్‌లో భాగంగా ప్రస్తుతం పరీక్షలు నిర్వహించి ఉండొచ్చని సమాచారం. 

పాక్ మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం మిసైల్ పరీక్షను సైనిక విన్యాసం 'ఎక్సర్సైజ్ ఇండస్' కింద చేపట్టినట్లు వెల్లడైంది. ఈ కార్యక్రమంలో మిలిటరీ స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ షాబాజ్ ఖాన్, స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ షహర్యార్ పర్వేజ్ బట్ పాల్గొన్నట్లు తేలింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దళాల సంసిద్ధతలను, మిసైల్ నావిగేషన్ వ్యవస్థను, టార్గెట్లను చేధించే సామర్థ్యాలను ప్రస్తుతం పాక్ తాజా పరీక్షించినట్లు ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకటనలో వెల్లడించింది. 

ప్రస్తుతం ప్రపంచంలో మిలిటరీ కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ ఐదవ స్థానంలో ఉంది. ఇందుకోసం ఏటా రక్షణ బడ్జెట్ కింద దాదాపు రూ.6 లక్షల 90వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇదే క్రమంలో పాకిస్థాన్ సైనిక వ్యయం కేవలం రూ.80వేల కోట్లు మాత్రమే. ఇటీవలి ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం మెుదలవటంతో పరిస్థితులు ముదురుతున్నాయి.