
- ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు
హైదరాబాద్, వెలుగు: సిటీలోని కల్లు కాంపౌండ్లపై టీఎస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీ న్యాబ్), స్థానిక పోలీసులు రెయిడ్స్ చేశారు. అల్ప్రాజోలం డ్రగ్ కలపడంతో పాటు కల్లును కల్తీ చేస్తున్నారనే ఫిర్యాదులతో గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. గ్రేటర్‌లోని 68 కల్లు కాంపౌండ్లలో సోదాలు జరిపారు. తిరుమలగిరిలోని కల్లు కాంపౌండ్‌లో అల్ఫ్రాజోలం డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నిమ్మ ఉప్పు, మినప పిండిని సీజ్ చేశారు.
కల్లు ప్యాకెట్లను శాంపిల్స్ గా సేకరించి ల్యాబ్ లకు పంపించారు. కల్లులో అల్ఫ్రా జోలం డ్రగ్ కలుపుతున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేపట్టినట్లు టీ న్యాబ్ ఎస్పీ సునీతా రెడ్డి తెలిపారు. తిరుమలగిరిలోని కల్లు కాంపాండ్ పై ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డ్రగ్ కంటెంట్‌కు అనుగుణంగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద యాక్షన్ తీసుకుంటామని ఆమె తెలిపారు.