మన వస్తువులే కొందాం..ఇతరులతోనూ కొనిద్దాం..మన్ కి బాత్ లో ప్రధాని

మన వస్తువులే కొందాం..ఇతరులతోనూ కొనిద్దాం..మన్ కి బాత్ లో ప్రధాని

న్యూఢిల్లీవచ్చే రెండు, మూడేండ్ల పాటు లోకల్​ వస్తువులను ప్రోత్సహించాలని, వాటినే కొనాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. ‘‘ఇక్కడే తయారైన, మన వాళ్ల చేతుల్లో రూపుదిద్దుకున్న వస్తువులనే కొనుగోలు చేయాలి. మనం కొనడమే కాదు వాటిని కొనేలా ఇతరులను కూడా మోటివేట్​ చేయాలి. దీనికి ఎక్కువ కాలం తీసుకోవద్దు. 2022వ సంవత్సరం వరకు.. అంటే 75వ ఇండిపెండెన్స్​డే పూర్తయ్యే వరకు ఈ పని చేస్తే చాలు’’అని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆల్​ఇండియా రేడియోలో 2019లో తన చివరి ‘మన్​ కీ బాత్’లో ప్రధాని మోడీ మాట్లాడారు. స్వదేశీ, మేక్​ ఇన్​ ఇండియా వస్తువులను ఎంకరేజ్ చేసే పనిని కేంద్ర ప్రభుత్వం ఒక్కటే చేయలేదని, దేశవ్యాప్తంగా యువత ముందుకొచ్చి చిన్న చిన్న ఆర్గనైజేషన్లు పెట్టాలని, జనాన్ని మోటివేట్​ చేసి, వాటి గురించి వివరించి, కొనేలా చేయాలని కోరారు. పేదరికంలో మగ్గుతున్న వారికి చేయూ త అందించేందుకు ఈ పని చేయాలన్నారు. గాంధీజీ వందేండ్ల క్రితమే ఇండియన్​ ప్రొడక్ట్​లను ప్రమోట్​ చేసే ప్రోగ్రాం ప్రారంభించారని, ఇప్పుడు ఆయన చూపిన దారిలో మనం నడవాలని చెప్పారు. తన ఇండిపెండెన్స్​ డే స్పీచ్​లో లోకల్​ ప్రొడక్ట్​లను ప్రమోట్​ చేయాలని కోరానని, ఇప్పుడు మరోసారి అదే విజ్ఞప్తి చేస్తున్నానని ప్రధాని మోడీ చెప్పారు.

యూత్ ప్రశ్నిస్తోంది

‘‘సిస్టమ్​ను యూత్​ నమ్ముతోంది. దానిని ఫాలో అయ్యేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఒకవేళ సిస్టమ్​ సరిగ్గా పనిచేయకపోతే దానిని వాళ్లు తేలికగా తీసుకోవడం లేదు. ధైర్యంగా అడుగు ముందుకేసి నిలదీస్తున్నారు. ప్రశిస్తున్నారు. ఇదో గొప్ప లక్షణంగా నేను భావిస్తున్నాను. రాబోయే దశాబ్దం యూత్​దే”అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. వచ్చే దశాబ్దంలో మోడ్రన్​ ఇండియా నిర్మాణంలో యంగ్​ ఇండియానే కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నట్టు
మోడీ చెప్పారు. దేశ అభివృద్ధిలో వారి తోడ్పాటు ఎంతో ఉంటుందన్నారు. అరాచకత్వం, అశాంతిని యూత్​ ద్వేషిస్తున్నారని యూత్​పై మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. కులతత్వం, బంధుప్రీతి, పక్షపాతం, జెండర్​ డిస్క్రిమినేషన్ మొదలైన వాటిని నేటి యువత వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌( సీఏఏ), నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్ఆర్సీ)కు వ్యతిరేకంగా పలు యూనివర్సిటీల క్యాంపస్​ల్లో హింస, ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ కామెంట్లు చేశారు.