
న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోడీది అంతా షో అని.. ఆయన దగ్గర సబ్జెక్టే లేదని హాట్ కామెంట్స్ చేశారు. మీడియానే మోడీకి ఎక్కువ హైప్ ఇచ్చిందని.. ఆయన వాస్తవికతకు మించి చూపించిందని అన్నారు. ప్రధాని మోడీని రెండు మూడు సార్లు కలిసిన తర్వాత తనకు ఈ విషయం అర్ధమైందన్నారు రాహుల్.
అలాగే, దేశ బ్యూరోక్రసీలో అణగారిన, అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శల కురిపించారు రాహుల్. దేశ జనాభాలో దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, మైనారిటీలు కలిసి దాదాపు 90% ఉన్నారు. కానీ బడ్జెట్ రూపొందించిన తర్వాత జరిపే హల్వా వేడుకలో ఈ 90% మందికి ప్రాతినిధ్యం వహించే వారు ఎవరూ లేరని విమర్శించారు. కానీ ఈ 90% జనాభా దేశ ఉత్పాదక శక్తిని ఏర్పరుస్తుందని అన్నారు.
ALSO READ | మోదీ ప్రభుత్వం కుట్రతోనే జనగణనను ఆపేసింది: రాహుల్ గాంధీ
తాను 2004లో రాజకీయాల్లోకి వచ్చా.. ఇప్పటికీ 21 సంవత్సరాలు గడిపోయాయి. నా రాజకీయ జీవితంలో దళితులు, షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) సమస్యలను అర్థం చేసుకున్నాను కానీ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబిసి) వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడంలో విఫలమయ్యానని రాహుల్ గాంధీ ఒప్పుకున్నారు. ఇది తనే తప్పేనని.. త్వరలోనే తప్పును సరిదిద్దుకుంటానని మాట ఇచ్చారు. యూపీఏ హయాంలో ఓబీసీల సమస్యలను తాను అర్థం చేసుకుని ఉంటే దేశంలో ఇప్పటికే కుల గణన జరిగి ఉండేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో విజయవంతంగా కుల గణన సర్వే నిర్వహించామని.. త్వరలోనే మిగిలిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా క్యాస్ట్ సెన్సెస్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో నిర్వహించిన కుల గణన ఒక రాజకీయ భూకంపంమని.. ఇది దేశ రాజకీయ భూమిని కుదిపేసిందన్నారు. దాని ప్రకంపనల ప్రభావం దేశమంతటా ఉంటుందని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ.