అంబర్​పేట బీజేపీ అభ్యర్థిగా..ఆలె నరేంద్ర కొడుకు జితేంద్ర?

అంబర్​పేట బీజేపీ అభ్యర్థిగా..ఆలె నరేంద్ర కొడుకు జితేంద్ర?
  • అదే సెగ్మెంట్ నుంచి టికెట్ ​ఆశిస్తున్న మరో ముగ్గురు నేతలు

హైదరాబాద్, వెలుగు : బీజేపీకి పట్టున్న సెగ్మెంట్లలో ఆ పార్టీ నుంచి బలమైన నేతలను రంగంలోకి దించాలని నిర్ణయించింది.అందుకు తగ్గట్లుగానే జనాల్లో పేరున్న నేతలనే కాకుండా పార్టీలో సీనియర్లను పోటీకి దింపాలనుకుంటోంది. సిటీలో బీజేపీ బలమున్న సెగ్మెంట్లలో అంబర్​పేట ఒకటి. ఈ సెగ్మెంట్ నుంచి గతంలో రెండుసార్లు కిషన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ చేతిలో ఆయన ఓడిపోయారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.

ప్రస్తుతం కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​గా ఉన్న కిషన్ రెడ్డి అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఈ సెగ్మెంట్ నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై బీజేపీ అధిష్టానం పలువురి పేర్లను పరిశీలిస్తున్నది. 1980, 90లలో బీజేపీ అగ్రనేతగా వెలుగొందిన ఆలె నరేంద్ర కొడుకు..  ఆలె జితేంద్ర పేరును సైతం బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలె నరేంద్ర1980 నుంచి 2004 వరకు బీజేపీలో అగ్రనేతగా వెలుగొందారు. హిమాయత్ నగర్ సెగ్మెంట్ నుంచి 1985, 89, 94 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు.

రెండు సార్లు ఎంపీగా గెలిచారు. బీజేపీలో టైగర్​గా పేరొందిన నరేంద్రకు జనాల్లో ఎంతో ఆదరణ ఉండేది. పాతబస్తీలో బలమైన నేతగా ఉన్నారు. ఆయన కొడుకు, మాజీ కార్పొరేటర్ ఆలె జితేంద్ర ప్రస్తుతం బీజేపీ నుంచి  అంబర్​పేట టికెట్​ను ఆశిస్తున్నారు. అయితే,  మాజీ మంత్రి కృష్ణయాదవ్, దివంగత నేత ముఖేశ్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్, నల్లకుంట బీజేపీ కార్పొరేటర్ అమృత సైతం అంబర్ పేట టికెట్​ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. గత అసెంబ్లీఎన్నికల్లో జితేంద్ర మలక్ పేట నుంచి బీజేపీ అభ్యర్థిగా  పోటీ చేసి ఓడిపోయారు.

అంతకు ముందు 2004లో హైదరాబాద్ కార్పొరేషన్​ ఎన్నికల్లో గౌలిపురా డివిజన్​ నుంచి కార్పొరేటర్​గా విజయం సాధించారు. ఈసారి అంబర్​పేటలో పోటీకి తనకు అవకాశం కల్పించాలని కోరుతూ బీజేపీ అగ్రనేతలను కలుస్తున్నాడు.  ఆలె జితేంద్రను పోటీకి దింపితే ఆయన తండ్రి నరేంద్ర ఇమేజ్ కూడా  పార్టీకి కలిసి వస్తుందన్న కోణంలోనూ బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.