శివాజీరాజా ప్యానెల్ డబ్బులు పంచింది : నరేశ్

శివాజీరాజా ప్యానెల్ డబ్బులు పంచింది : నరేశ్

హైదరాబాద్ :  మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్యానెళ్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి. ప్రస్తుత మా అధ్యక్షుడు, మరోసారి పోటీలో నిలబడిన శివాజీరాజా ప్యానెల్ ఈసారి ఎన్నికల్లో సభ్యులకు డబ్బులు పంచిందని ప్రత్యర్థి ప్యానెల్ నాయకుడు నరేశ్ అరోపించారు. ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరగడంలేదని.. డబ్బులు పంచి గెలవాలనుకోవడం దురదృష్టకరమని నరేష్ అన్నారు. ఐతే… ఆరోపణలను శివాజీరాజా తప్పుపట్టారు. తమ పనితీరు, హామీలే గెలిపిస్తాయని చెప్పారు.

మరోవైపు.. మా ఎన్నికల్లో ఓటు వేయడానికి సీనియర్ నటుడు కృష్ణ, విజయనిర్మల వచ్చినప్పుడు ఆఫీస్ లో కరెంట్ పోయింది. లిఫ్ట్ లోనే 20 నిమిషాల పాటు కృష్ణ, విజయనిర్మల ఉండిపోయారు. 20 నిమిషాల తర్వాత కరెంట్ రావడంతో.. ఓటు వేశారు కృష్ణ దంపతులు.

ఫిలింనగర్ లోని ఫిలిం చాంబర్ లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి.  సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాత్రి 8 గంటలకల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ లో దాదాపు 745 సభ్యులకు ఓటు ఉంది.

ఈ ఎన్నికల్లో ప్రస్తుత మా అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి పోటీ చేశారు. అదే ప్యానెల్ లో మొన్నటివరకు జనరల్ సెక్రెటరీగా పని చేసిన నరేష్… శివాజీ రాజాకు పోటీగా బరిలోకి దిగారు.

శివాజీరాజా ప్యానెల్ లో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, నాగినీడు, పృథ్వీరాజ్, బెనర్జీ, బ్రహ్మాజీ, యంగ్ హీరోలు తనీష్, రాజ్ తరుణ్ సహా 25 మంది పోటీ చేశారు. మరోవైపు నరేశ్ ప్యానెల్ లో జీవిత, రాజశేఖర్, శివ బాలాజీ సహా 26 మంది సభ్యులు బరిలోకి దిగారు. అటు వైస్ ప్రెసిడెంట్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నటి హేమా రేసులో నిలిచారు.