నార్నూర్ బ్లాక్కు గోల్డ్మెడల్

నార్నూర్ బ్లాక్కు గోల్డ్మెడల్
  • సంపూర్ణత అభియాన్​లో ఉత్తమంగా ఉట్నూర్‌ ఐటీడీఏ
  • గవర్నర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్, ఐటీడీఏ పీవో
  • సంపూర్ణత అభియాన్​లో ఆసిఫాబాద్ జిల్లాకు అవార్డు

ఆదిలాబాద్, వెలుగు: నీతి ఆయోగ్ నార్నూర్ ఆస్పిరేషన్ లో భాగంగా విశేష అభివృద్ధి సాధించిన నార్నూర్ మండలం గోల్డ్​ మెడల్​ దక్కించుకుంది. ఇందుకు గానూ కలెక్టర్ రాజర్షి షా గోల్డ్ మెడల్ అందుకున్నారు. శనివారం హైదరాబాద్​లోని రాజ్ భవన్​లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్​వర్మ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. దేశవ్యాప్తంగా 500 ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో నార్నూర్ ఆస్పిరేషన్ బ్లాక్ ఆరోగ్యం, పోషణ, వ్యవసాయం, సామాజిక అభివృద్ధికి సంబంధించిన ఆరు సూచీల్లో మెరుగైన పనితీరును ప్రదర్శించింది. 

ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనుల సంక్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసి, అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సైతం పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

తిర్యాణిలో చేపట్టిన పనులకు గానూ..

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమ నిర్వహణలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అత్యుత్తమంగా నిలిచింది. సంపూర్ణత అభియాన్ ఆస్పిరేషన్ బ్లాక్ తిర్యాణిలో చేపట్టిన పనుల్లో అద్భుత పురోగతి సాధించినందుకు రాజ్ భవన్​లో జరిగిన సంపూర్ణ  అభియాన్ కార్యక్రమంలో జిల్లా తరఫున కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డీడబ్ల్యూవో భాస్కర్, డీఎంహెచ్​వో సీతారాం, డీటీడీవో రమాదేవి, డీపీవీ భిక్షపతి, డీఎల్ పీవో అమర్ హుస్సేన్, ప్లానింగ్ కోఆర్డినేటర్ అబిత్ అలీ తదితరులు పాల్గొన్నారు.