నర్సంపేట/ నెక్కొండ, వెలుగు : యూరియా పంపిణీ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేయాలని వరంగల్కలెక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నర్సంపేట మండలంలోని లక్నేపల్లి, చెన్నారావుపేట మండలంలోని లింగగిరి, నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామాల్లో ఎరువుల కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీలో యూరియా నిల్వలు, యూరియా టోకెన్ల పంపిణీ విధానం, రైతులకు ఎరువుల పంపిణీ జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు.
అక్కడున్న రైతులతో నేరుగా మాట్లాడారు. యూరియా పంపిణీ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు సౌకర్యంగా యూరియా పొందేందుకు ఎక్కువ సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా సహకార అధికారి నీరజ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
