రఘురామకృష్ణ రాజు గుంటూరు జైలుకు తరలింపు

రఘురామకృష్ణ రాజు గుంటూరు జైలుకు తరలింపు

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాక ఆయనను నేరుగా జిల్లా జైలుకు తరలించారు. ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలన్నీ అయిపోయాక రమేష్ ఆసుపత్రిలో ఉంచి ఆయనకు చికిత్స కొనసాగించాలని సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించిన విషయం తెలిసిందే. 
అరెస్టు సందర్భంగా తనను పోలీసులు కొట్టారని, కాలికి గాయాలయ్యాయని రఘురామకృష్ణ రాజు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించిన సీఐడీ కోర్టు న్యాయమూర్తి  ఈనెల 28 వరకు రోజుల రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆయనను కొట్టారో లేదో నిర్ధారించేందుకు మెడికల్ ఎక్స్ పర్ట్ టీమ్ ను ఏర్పాటు చేసి ఆదివారం ఉదయం లోగా వైద్య పరీక్షలు చేసి నివేదిక సమర్పించాలని గుంటూరు  సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

రాజుకు 14 రోజులు పోలీస్‌ కస్టడీకి అనుమతించినప్పటికీ ఆయన ఆరోగ్యం బాగయ్యే వరకు జైలుకు తరలించొద్దని సీఐడీ కోర్టు నిన్ననే ఆదేశించింది.ఆయన ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు వై కేటగిరీ భద్రత కల్పించాలని కూడా న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఈ నేపధ్యంలో రఘురామకృష్ణరాజును  వైద్య పరీక్షల కోసం ఉదయమే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపారు. రాజుకు వైద్య పరీక్షలు జరుగుతున్న తరుణంలో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. 18 రకాల  వైద్య పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత కొద్దిసేపటి క్రితం భారీ బందోబస్తుతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జైలు వద్ద ఎలాంటి ప్రతిఘటన గాని.. నిరసన గాని ఎదురుకాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెడికల్ బోర్డు కాసేపట్లో సీఐడీ కోర్టుకు నివేదిక తరలించనున్న నేపధ్యంలో ఆయనను జిల్లా జైలుకు తరలించారు. మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికను సీఐడీ కోర్టు వెంటనే హైకోర్టుకు నివేదించే అవకాశం ఉంది.