తనను తాను.. చెప్పుతో కొట్టుకున్న కౌన్సిలర్..

తనను తాను.. చెప్పుతో కొట్టుకున్న కౌన్సిలర్..

ఈ కౌన్సిలర్ కు ప్రజలపై ఎంతో ప్రేమ.. ఓటేసిన ప్రజలకు సేవ చేయాలనే తపన.. గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలని తహతహలాడారు. అలాంటి కౌన్సిలర్ కి.. తన వార్డులో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతున్నాననే బాధ కొంత కాలంగా వెంటాడుతోంది. తిన్నా.. పడుకున్నా ప్రజల గురించే ఆలోచించినట్లు ఉన్నాడు ఆ కౌన్సిలర్.. ఏమీ చేయలేక మున్సిపల్ మీటింగ్ లో.. తన ఆవేదనను నిరసన రూపంలో వినూత్నంగా  తెలియజేశారు. ఈ కౌన్సిలర్ ఎవరో కాదు.. రామరాజు. ఏపీ రాష్ట్రం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వార్డు కౌన్సిలర్. జులై 31వ తేదీ మున్సిపల్ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే.. తన వార్డులోని ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నట్లు ఫీలయ్యి.. అందరి ముందు తన చెప్పుతో తానే నాలుగు సార్లు కొట్టుకున్నారు.

పదవిలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా.. కనీసం మంచినీటిని సరఫరా చేసే కుళాయిలు కూడా ఏర్పాటు చేయలేకపోయాయనని.. వీధి లైట్లు బిగింపజేయలేకపోయానని.. వార్డుకు కనీసం అప్రోచ్ రోడ్డు కూడా వేయించలేకపోయానంటూ కన్నీళ్లతో తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి గెలవటమే తాను చేసిన తప్పని.. ప్రతిపక్ష పార్టీ సభ్యుడిని కావటం వల్లే.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరించటం లేదని ఆరోపించారు. ఏం చేయాలో తెలియక.. ఇలా చేస్తున్నానని విలపించారు.

నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఉమా శంకర్ గణేష్.. రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు నెరవేర్చలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కౌన్సిలర్. ఓవరాల్ గా చూస్తే మాత్రం జనం వ్యక్తిగత సమస్యలు వాలంటీర్ల రూపంలో తీరుతున్నా.. అభివృద్ధి విషయంలోనే ఈ కౌన్సిలర్ చాలా ఫీలవుతున్నారు. మొత్తానికి వార్డు కౌన్సిలర్ చెప్పుతో కొట్టుకోవటం  అందరికీ కనిపించింది కానీ.. ఓటేసిన జనం తమ సమస్యలు పరిష్కరించటం లేదంటూ వాళ్లకు వాళ్లుగా ఎంత మంది తమ చెప్పులతో కొట్టుకున్నారో కదా..