
NASA Voluntary Layoff: అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపులు వరుసగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సెగ స్పేస్ ఏజెన్సీ నాసాకు కూడా చేరుకుంది. గడచిన అనేక దశాబ్ధాల్లో ఇదే పెద్ద ఉద్యోగుల తగ్గింపుగా ఉంది. 2026 బడ్జెట్లో నాసాకు 24 శాతం బడ్జెట్ తగ్గింపు ప్రస్తుత పరిస్థితులకు కారణంగా తెలుస్తోంది
ప్రస్తుత పరిస్థితులతో స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేసే వారి కోసం ప్రత్యేక ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నట్లు నాసా తన ఉద్యోగులకు అంతర్గతంగా పంపిన మెమోలో వెల్లడించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మెుత్తం ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 17వేల 391 నుంచి 11వేల 853కి చేరుకోవచ్చని తెలుస్తోంది. అయితే తమంతట తాముగా వెళ్లిపోవాలనుకునే ఉద్యోగులకు ఆర్థికంగా, రవాణా బెనిఫిట్స్ అందించాలని నిర్ణయించింది.
నాసా ప్రకటించిన ప్రోగ్రాం కింద వెళ్లిపోవటానికి ఇష్టపడుతున్న వారు తమ పేర్లను జూలై 25 నాటికి వెల్లడించాలని సంస్థ పేర్కొంది. దీనికింద ఎవరైతే రాజీనామా చేస్తారో వారికి 2026 జనవరి వరకు వేతనం అందుతుందని నాసా పేర్కొంది. దీని కింద వెళ్లిపోవాలనుకునేవారిని రెండు వారాల్లో రిలీవ్ చేయనున్నట్లు సమాచారం. కొంతమంది అత్యవసర ఉద్యోగులను ఏప్రిల్ 2026 వరకు కొనసాగిస్తారని వెల్లడైంది. ఇక తప్పని పరిస్థితుల్లో వారిని సెప్టెంబర్ 2026 వరకు కొనసాగించాలని నిర్ణయించబడింది. అయితే ఈ ప్రక్రియపై అధికారికంగా నాసా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన బయటకు విడుదల చేయలేదని తెలుస్తోంది.