
38 ఏళ్ల కిందటి నాసా ఉపగ్రహానికి చివరి ఘడియలు
కేప్ కెనవెరల్ : నాసాకు చెందిన 38 ఏళ్ల కిందటి పాత శాటిలైట్ ఇయ్యాల (ఆదివారం) రాత్రి కూలిపోనుంది. ఎర్త్ రేడియేషన్ బడ్జెట్ శాటిలైట్(ఈఆర్బీఎస్) గా వ్యవహరిస్తున్న ఈ శాటిలైట్ తన అంతరిక్ష కక్ష్య నుంచి అదుపు తప్పి.. భూమిపైకి పడిపోనుంది. అయితే దీనివల్ల ఎక్కడా, ఎలాంటి నష్టం జరగదని, భయపడాల్సిన అవసరం లేదని నాసా స్పష్టం చేసింది. 2,450 కేజీల బరువుండే ఈ శాటిలైట్ భూమి కక్ష్యలోకి ప్రవేశించే క్రమంలో మార్గం మధ్యలోనే పూర్తిగా కాలి బూడిదవుతుందని తెలిపింది. అయితే శాటిలైట్‌కు చెందిన కొన్ని శకలాలు భూమిపై పడే వీలుందని పేర్కొంది. ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్, ఉత్తర, దక్షిణ అమెరికాల్లోని పశ్చిమ ప్రాంతాల్లో శకలాలు పడొచ్చని నాసా అంచనా వేసింది.
జీవితకాలం రెండేళ్లే కానీ..
‘ఈఆర్బీఎస్’ను నాసా 1984లో ఛాలెంజర్ వ్యోమనౌక ద్వారా అంతరిక్ష కక్ష్యలోకి పంపింది. ఓజోన్, ఇతరత్రా వాతావరణ సంబంధిత అంశాలపై సమాచారాన్ని సేకరించి భూమికి పంపే పనిని ఈఆర్బీఎస్ చేసింది. సూర్యుడు, భూమి మధ్య సాగే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ప్రక్రియపై కూడా ఈ శాటిలైట్ అధ్యయనం చేసింది. వాస్తవానికి దీని జీవితకాలం రెండేళ్లేనని 1984లో నాసా తెలిపింది. అయితే దాన్ని వాడుకొని 2005 సంవత్సరం వరకు(21 ఏళ్లపాటు) సమాచారాన్ని సేకరించింది. గత 17 ఏళ్లుగా ‘ఈఆర్బీఎస్’ వినియోగంలో లేదు. అది స్క్రాప్‌గా మారిపోయి అంతరిక్షంలో చక్కర్లు కొడుతోంది. ఈక్రమంలో దాని సాంకేతిక నిర్వహణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని.. ఇవాళ రాత్రికి కూలిపోయే పరిస్థితి వచ్చింది.