మార్స్​పై సరస్సు..నాసా అంచనా

మార్స్​పై సరస్సు..నాసా అంచనా

చంద్రుడైనా, మార్స్​ అయినా ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలు నీటి జాడ తెలుసుకోవడానికే. వేరే ప్రయోగాలూ జరుగుతున్నా ప్రధాన ఉద్దేశం మాత్రం నీళ్లే. మార్స్​ మీద ఇప్పటికే నీటి జాడలున్నట్టు తేలింది. అంగారకుడి మీద జరజరా తిరిగేస్తున్న నాసా క్యూరియాసిటీ రోవర్​ మార్స్​పై సరస్సున్నట్టు గుర్తించింది. 150 కిలోమీటర్ల వెడల్పైన గాలె లోయలో తిరుగుతున్న రోవర్​, ఆ సరస్సు తాలూకు డేటాను సేకరించింది. ఫొటోలు తీసింది. ఆ ఫొటోలను పరిశీలించిన నాసా సైంటిస్టులు సుమారు 350 కోట్ల ఏళ్ల క్రితం ఆ లోయలో పెద్ద సరస్సు ఉండి ఉండొచ్చని అంచనాకు వచ్చారు. లోయ గోడలు, అడుగు భాగంపై ఉన్న నెర్రెలు, పగుళ్లు, అచ్చుల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. నీటి ప్రవాహంలోని పూడికలు గాలె క్రేటర్​లో పొరలుపొరలుగా ఏర్పడ్డాయని అంటున్నారు. గాలి ప్రభావంతో ఆ పొరలే మౌంట్​ షార్ప్​గా ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. మార్స్​పై ఏ రాయిలోనూ లేని లవణాలు, ఇతర మూలకాలు గాలె క్రేటర్​ రాళ్లలో ఉన్నట్టు క్యూరియాసిటీ విశ్లేషణలో తేలింది.