నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో నాసిక్ విద్యార్థి అరెస్ట్

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో నాసిక్ విద్యార్థి అరెస్ట్

ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2026-నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే క్వశ్చన్ పేపర్ లీక్ కుంభకోణానికి కేంద్ర బిందువుగా ఉన్న ‎గెస్ పేపర్‎ను కొనుగోలు చేసిన ఆరోపణలపై మహారాష్ట్రలోని నాసిక్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ విద్యార్థిని మంగళవారం (మే 12) పోలీసులు అరెస్ట్ చేశారు. 

రాజస్థాన్ పోలీసుల సమాచారం మేరకు నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని శుభం ఖైర్నార్‌గా గుర్తించారు. టెలిగ్రామ్ ద్వారా నిందితుడు నీట్ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసి, దానిని హర్యానాకు చెందిన మరో వ్యక్తికి విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ నాసిక్ క్రైమ్ బ్రాంచ్ నుంచి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

నీట్ యూజీ-2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజస్థాన్ లో పేపర్ లీక్ ఆరోపణలతో పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి పరీక్షల తేదీలు త్వరలోనే ప్రకటించున్నట్లు వెల్లడించింది. పేపర్ లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించింది కేంద్రం. 

2026 సంవత్సరానికి గానూ నీట్ పరీక్షను మే 3వ తేదీన నిర్వహించారు. అయితే రాజస్థాన్ లో పేపర్ లీకైనట్లు వార్తలు వచ్చాయి. ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు 48 గంటల ముందు విద్యార్థులకు ఇచ్చిన ప్రాక్టీస్ పేపర్ లోని ప్రశ్నల్లో దాదాపు 600 మార్కుల ప్రశ్నలు ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ లో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో దేశ వ్యాప్తంగా విద్యార్థులు తల్లింద్రడులు ఆందోళనలకు గరయ్యారు. మరోవైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పరీక్ష ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎంబీబీఎస్, బీడీఎస్  కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్  ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2026 తెలంగాణ నుంచి 73 వేలకు పైనే మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ కు  అప్లై చేశారు.