ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా డోపింగ్ చట్టం

 ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా డోపింగ్ చట్టం

న్యూఢిల్లీ: క్రీడా రంగంలో డోపింగ్‌‌‌‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. క్రీడాకారులకు నిషేధిత మందులను సరఫరా చేసే వారికి, అక్రమ రవాణాకు పాల్పడే వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా డోపింగ్​చట్టాన్ని సవరించనున్నారు. క్రీడాకారులు నిషేధిత మందులు వాడుతున్నట్లు తెలిసి కూడా ప్రిస్క్రిప్షన్ రాసిచ్చే వైద్యులను సైతం ఈ చట్టం పరిధిలోకి తెస్తూ క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. 

రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెడతామని క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. డోపింగ్ అనేది ఇప్పుడు కేవలం క్రీడా నియమాల ఉల్లంఘన మాత్రమే కాదని, అదొక వ్యవస్థీకృత నెట్‌‌‌‌వర్క్‌‌‌‌గా మారి క్రీడాకారులను వాడుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడా పోటీల్లో డోపింగ్‌‌‌‌కు సహకరించినా, నిషేధిత పదార్థాలను సరఫరా చేసినా ఐదేళ్ల జైలు శిక్ష లేదా రూ. 2 లక్షల జరిమానా విధించవచ్చు’ అని మాండవీయ పేర్కొన్నారు.