
- మొదటిరోజు 32 ఈవెంట్లలో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులు
- వివిధ రాష్ట్రాల అథ్లెట్లతో సందడిగా మారిన స్టేడియం
హనుమకొండ, వెలుగు : జాతీయస్థాయి 5వ ఓపెన్ అండర్-–23 అథ్లెటిక్స్ పోటీలు హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో గురువారం (అక్టోబర్ 16) అట్టహాసంగా షురూ అయ్యాయి. వరంగల్ ఎంపీ కడియం కావ్య, రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ ఎర్రబెల్లి రాజేశ్వరరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్, మేయర్ గుండు సుధారాణి హాజరై పోటీలను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి 936 మంది అథ్లెట్స్ తరలిరాగా.. స్టేడియం సందడిగా మారింది.
తొలిరోజు 32 ఈవెంట్లలో పోటీలు నిర్వహించగా.. ఇందులో మెన్, విమెన్ విభాగాల్లో 10 వేల మీటర్ల రేస్, డిస్కస్ త్రో, 100, 400, 1500 మీటర్ల రేస్, హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, పోల్ వాల్ట్, హ్యామర్ త్రో తదితర పోటీలు జరిగాయి. ఆయా విభాగాల్లో అథ్లెట్లు హోరాహోరీగా పోటీ పడ్డారు. కాగా తొలుత మెన్స్ విభాగంలో 10 వేల మీటర్ల రేస్ నిర్వహించగా.. ఇండియన్ యూనివర్సిటీస్ కు చెందిన రిజ్వాన్ 29 నిమిషాల 48 సెకన్లలో రేస్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. యూపీకి చెందిన సచిన్ యాదవ్, కర్నాటకకు చెందిన శివాజీ కాషురాం తర్వాత స్థానాల్లో నిలిచారు. విమెన్స్ 10 వేల మీటర్ల రేస్ లో రాజస్థాన్ కు చెందిన లతికా తల్వార్ గోల్డ్ మెడల్ సాధించగా.. మహారాష్ట్రకు చెందిన ఆర్తీ పవారా సిల్వర్, మధ్యప్రదేశ్ కు చెందిన బుష్రా గౌరీ బ్రాంజ్ మెడల్ పొందారు.
విమెన్స్ డిస్కస్ త్రో లో ఎన్సీవోఈ పటియాల కు చెందిన నిఖితా కుమారి టాప్ లో నిలవగా.. రాజస్థాన్ కు చెందిన కిరణ్, కేరళకు చెందిన అఖిల రాజు తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. మెన్స్ హ్యామర్ త్రోలో తమిళనాడుకు చెందిన ఎస్.దినేశ్ గోల్డ్ మెడల్ సాధించగా.. రాజస్థాన్ కు చెందిన పవన్, యూపీకి చెందిన రాబిన్ యాదవ్ సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ పొందారు. మరికొన్ని ఈవెంట్లలో సెమీస్, ఫైనల్స్ క్వాలిఫయర్ పోటీలు నిర్వహించగా.. శుక్ర, శనివారాలతో ముగుస్తాయి. కాగా హైజంప్ పోటీలో ఓ క్రీడాకారుడి తలకు గాయమైంది. అతడికి వెంటనే ట్రీట్ మెంట్ అందించారు.
ఒలింపిక్స్ లో పతకాలు సాధించాలి : ఎంపీ కావ్య
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందని, క్రీడాకారులు ఒలింపిక్స్ లో పతకాలు సాధించేస్థాయికి ఎదగాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆకాంక్షించారు. అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించి ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడల పట్ల విజన్ తో పని చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్ లో ఒలింపిక్స్ కూడా హైదరాబాద్ లో నిర్వహిం చేలా ప్లాన్ తో ముందుకెళ్తున్నారని తెలిపారు.
ఒలింపిక్స్ లో పతకాలు సాధించే విధంగా హైదరాబాద్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు ఎంపీలంతా
పీటీ ఉషను కూడా కలిశామని పేర్కొన్నారు. వరంగల్ సిటీలోని నెహ్రూ స్టేడియాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్ ఖాన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.