
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డు కింద రూ.కోటి ప్రోత్సాహక బహుమతి లభించనుంది. ఆర్థిక స్వావలంబన సాధించిన పంచాయతీలకు ఈ అవార్డు అందిస్తారు. ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను మాల్ గ్రామ పంచాయతీ సమకూర్చుకుంది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల కూడలిలో ఉన్న మాల్ గ్రామం ఏడాదికి రూ.90 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
బీహార్ లోని మధుబనీలో గురువారం నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డును జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి అధికారుల బృందం అవార్డు అందుకోనున్నారు. కాగా, మాల్ పంచాయతీ జాతీయ అవార్డును కైవసం చేసుకోవడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించుకుని, సాధికారత, స్వయం సమృద్ధికి నిర్వచనంగా నిలిచిందన్నారు.
పంచాయతీ ఆర్థిక స్వావలంబన కోసం కృషిచేసిన అధికారులను మంత్రి సీతక్క అభినందించారు. మాల్ పంచాయతీని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామపంచాయతీ ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంను పురస్కరించుకొని మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. అధికార వికేంద్రీకరణ, పంచాయతీల పటిష్టత కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి సీతక్క గుర్తు చేసుకున్నారు.