Cancer Disease: తొలి దశలోనే అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించడం కష్టమే. కానీ..

Cancer Disease: తొలి దశలోనే అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించడం కష్టమే. కానీ..

క్యాన్సర్‌‌‌‌ని జయించడమంటే ఒక రకంగా మృత్యువుని జయించినట్టే అని చెప్తుంటారు. అది సాధ్యపడాలంటే అడ్వాన్స్‌‌డ్‌‌ ట్రీట్‌‌మెంట్స్‌‌తోపాటు రోగికి మనోధైర్యం ఉండాలి. క్యాన్సర్‌‌‌‌ని తొలి దశలోనే గుర్తించగలగాలి. ట్రీట్‌‌మెంట్‌‌ వల్ల వచ్చే సైడ్‌‌ ఎఫెక్ట్స్‌‌తో పాటు అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అలా ఇప్పటివరకు ఎంతోమంది క్యాన్సర్‌‌‌‌ని జయించారు. అలాంటి వాళ్ల ధైర్యాన్ని గౌరవించడానికి, క్యాన్సర్‌‌‌‌ సర్వైవైవింగ్​ మీద అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూన్​లో వచ్చే మొదటి ఆదివారం ‘నేషనల్‌‌ క్యాన్సర్‌‌‌‌ సర్వైవర్స్‌‌ డే’గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌‌‌‌ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి? వస్తే ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. కానీ.. అలా  జరగకుండా కణాలు వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెందితే అదే క్యాన్సర్‌‌‌‌. అలా పెరిగిన కణాలు శరీరంలో ‘కణితి’( ట్యూమర్)గా ఏర్పడుతుంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. రకాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. రకంతో పాటు స్టేజ్​, వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన ట్రీట్‌‌మెంట్‌‌ ఇస్తారు.

కొన్ని రకాల క్యాన్సర్లు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం కూడా ఉంది. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో ఇదీ ఒకటి. మన దేశంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మందికి క్యాన్సర్ సోకుతోంది. అయితే.. చాలారకాల క్యాన్సర్ల నుంచి బయటపడొచ్చు. వైద్య విధానంలో వచ్చిన మార్పులు, స్టార్టింగ్‌‌ స్టేజీలోనే గుర్తించగలగడం, ఫ్యామిలీ, సొసైటీ సపోర్ట్‌‌, వ్యక్తిగత సంకల్పం క్యాన్సర్‌‌‌‌ని ఓడించగలవని ఇప్పటికే ఎంతోమంది క్యాన్సర్ సర్వైవర్స్ నిరూపించారు. 

రాకుండా ఎలా జాగ్రత్త పడాలి ?
క్యాన్సర్‌‌ రాకుండా పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా కొన్ని లైఫ్​ స్టయిల్​ మార్పులతో రిస్క్‌‌ను తగ్గించుకోవచ్చు. సెడెంటరీ లైఫ్‌‌స్టయిల్​ వల్ల ఊబకాయం లాంటి సమస్యలు వచ్చి అవి క్యాన్సర్‌‌‌‌కు దారితీస్తున్నాయి. కొన్ని దురలవాట్లు కూడా క్యాన్సర్‌‌ కారకాలే. స్మోకింగ్ చేయడం, టొబాకో తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు, గొంతు, క్లోమ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. మితిమీరి ఆల్కహాల్​ తీసుకోవడం వల్ల బ్రెస్ట్‌‌, లివర్‌‌‌‌ క్యాన్సర్లకు దారి తీస్తుంది. కాబట్టి అలాంటివాటికి దూరంగా ఉండాలి. రెగ్యులర్గా ఎక్సర్‌‌‌‌సైజ్ చేయాలి.

బ్యాలెన్స్‌‌డ్‌‌ డైట్ అంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే ఫుడ్‌‌ తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌‌కి దూరంగా ఉండాలి. వయసు, ఎత్తుని బట్టి శరీర బరువు ఉండాలి. ఆ వెయిట్‌‌కు మించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడాలి. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు.. ముందుగానే వ్యాక్సినేషన్ చేయించుకుంటే సర్వైకల్​, లివర్‌‌‌‌ క్యాన్సర్లు‌‌ రావు. అలాంటివాటిని చేయించుకోవాలి.

తొలి దశలోనే గుర్తించాలి
తొలి దశలోనే అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించడం కష్టమే. కానీ.. స్టార్టింగ్‌‌ స్టేజీలో గుర్తిస్తే సర్వైవల్ అవకాశాలు పెరుగుతాయి. బ్రెస్ట్‌‌, టెస్టిక్యులర్​ క్యాన్సర్లను స్టార్టింగ్‌‌ స్టేజీలో ఎవరికి వాళ్లే గుర్తించవచ్చు. క్యాన్సర్​ని బట్టి సింప్టమ్స్‌‌ ఉంటాయి. ఉదాహరణకు.. లంగ్​ క్యాన్సర్‌‌‌‌ విషయానికొస్తే బాగా దగ్గు, ఆయాసం, దగ్గుతున్నప్పుడు రక్తం పడడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటాయి. బ్రెయిన్ క్యాన్సర్​ అయితే.. తలనొప్పి, వాంతులు, చూపు మసకబారడం లాంటివి ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడూ అలసటగా ఉండడం, గడ్డలు, రక్తస్రావం, రెగ్యలర్‌‌‌‌గా నొప్పి రావడం లాంటివి కూడా కొన్ని రకాల క్యాన్సర్లను సూచించే లక్షణాలే.

మరికొన్ని క్యాన్సర్లను స్క్రీనింగ్ టెస్ట్‌‌లు చేసి తొలి దశలోనే గుర్తించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్‌‌‌‌ని మొమోగ్రామ్, గర్భాశయ క్యాన్సర్‌‌‌‌ని పాప్ స్మియర్, పెద్దపేగు క్యాన్సర్‌‌‌‌ని కొలనోస్కోపీ లాంటి వాటి ద్వారా గుర్తిస్తారు. అయితే.. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్‌‌‌‌ ఉంటే ముందుగానే స్క్రీనింగ్‌‌ టెస్ట్‌‌లు చేయించుకుంటే మంచిది.

ఉందని తెలిశాక.. 
క్యాన్సర్ ఉందని తెలిసిన వెంటనే ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకోవడం వల్ల కూడా కోలుకునే అవకాశాలు  పెరుగుతాయి. అంతేకాదు.. దాని నుంచి తొందరగా బయటపడాలంటే పేషెంట్‌‌ తన సమస్య గురించి పూర్తిగా తెలుసుకోవాలి. క్యాన్సర్ రకం, దశ, లక్షణాలు, ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటే ఎదురయ్యే సమస్యలు.. ఇలా అన్నింటి గురించి తెలుసుకుని వాటిని ఎదుర్కోవడానికి శారీకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి.

దాంతో పాటు డాక్టర్లు ఇచ్చే సూచనలు కచ్చితంగా పాటించాలి. క్యాన్సర్‌‌‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ ఒక్కరోజులో పూర్తయ్యేది కాదు. కాబట్టి డాక్టర్‌‌‌‌ దగ్గరికి పదే పదే వెళ్తుండాలి. ఈ విషయంలో నెగ్లెక్ట్‌‌ చేయకూడదు. ఫాలోఅప్​  ఉన్న రోజు కచ్చితంగా ట్రీట్‌‌మెంట్‌‌కి వెళ్లాలి. ఈ మధ్యలో ఎదురైన సమస్యలను గుర్తుపెట్టుకుని డాక్టర్‌‌‌‌కి చెప్పాలి. దానివల్ల డాక్టర్‌‌‌‌కు రోగి పరిస్థితి పూర్తిగా అర్థమవుతుంది.  

అడ్వాన్స్‌‌డ్‌‌ టెక్నాలజీ
ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల క్యాన్సర్‌‌‌‌ సర్వైవల్స్‌‌ పర్సంటేజ్‌‌ బాగా పెరిగింది. గతంలో క్యాన్సర్‌‌‌‌ వచ్చిందంటే బతకడం కష్టమే అనే భావన ఉండేది. కానీ.. ఇప్పుడు క్యాన్సర్‌‌‌‌తో చనిపోయే వాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఉదాహరణకు.. అడ్వాన్స్‌‌డ్‌‌ స్టేజ్‌‌ ఫోర్ లంగ్‌‌ క్యాన్సర్​  ఉన్న వ్యక్తికి కీమో థెరపీ ఇస్తే.. 9 నుంచి 12 నెలలు మాత్రమే బతికే అవకాశాలు ఉండేవి. కానీ.. అలాంటివాళ్లకు టార్గెటెడ్‌‌ కీమో థెరపీ ఇవ్వడం వల్ల ఐదేండ్ల వరకు బతుకుతున్నారు.

అవగాహన పెరగాలి
క్యాన్సర్‌‌‌‌ను ట్రీట్‌‌మెంట్‌‌తో మాత్రమే తగ్గించగలం. అంతేకానీ.. కేవలం లైఫ్‌‌స్టైల్‌‌, ఫుడ్‌‌లో మార్పులు చేయడం వల్ల క్యాన్సర్‌‌‌‌ తగ్గుతుంది అనుకోవడం పెద్ద పొరపాటు. చాలామంది క్యాన్సర్‌‌‌‌ ఉందని తెలిసిన తర్వాత కూడా ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకోకుండా వాళ్లకు తెలిసిన రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రామాఫలం తింటే క్యాన్సర్ తగ్గిపోతుంది అని నమ్ముతారు. కానీ.. అవన్నీ అవాస్తవాలు. కాకపోతే.. ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ మంచి ఫుడ్‌‌ తినడం, వ్యాయామం చేయడం వల్ల ట్రీట్‌‌మెంట్‌‌ సైడ్‌‌ ఎఫెక్ట్స్‌‌ నుంచి తొందరగా కోలుకోవచ్చు. 

ఫ్యామిలీ సపోర్ట్‌‌
క్యాన్సర్‌‌‌‌ నుంచి బయటపడడానికి డాక్టర్‌‌‌‌ ఇచ్చే ట్రీట్‌‌మెంట్‌‌ ఎంత ముఖ్యమో ఫ్యామిలీ సపోర్ట్‌‌ కూడా అంతే ముఖ్యం. కీమో థెరపీ లాంటి వాటి వల్ల పేషెంట్‌‌ సరిగ్గా ఫుడ్‌‌ తినకపోవడం, బలహీనంగా మారడం, వాంతులు చేసుకోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. పైగా ప్రాణభయం పెరుతుంది. కాబట్టి అలాంటి టైంలో ఇంట్లో వాళ్ల సపోర్ట్‌‌ చాలా అవసరం.  

పేషెంట్లు పెరుగుతున్నారా ?
ఒకప్పుడు కాస్త వయసు ఎక్కువగా ఉన్నవాళ్లు క్యాన్సర్‌‌‌‌తో చనిపోయినా వయసు పైబడడం వల్లే చనిపోయారు అనుకునేవాళ్లు. ఇప్పుడు స్క్రీనింగ్​ టెస్ట్‌‌ ఫెసిలిటీస్‌‌ ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్‌‌‌‌ ఉందని ఈజీగా గుర్తిస్తున్నాం. దానివల్ల కూడా క్యాన్సర్‌‌‌‌ కేసులు ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి.  

తగ్గిన తర్వాత..
క్యాన్సర్ తగ్గిన తర్వాత కూడా కొందరికి రెండు మూడేళ్ల పాటు దాని తాలూకు ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి కొన్నాళ్లపాటు రెగ్యులర్‌‌‌‌గా హెల్త్‌‌ చెకప్స్‌‌ చేయించుకోవాలి. కొందరిలో తగ్గిన తర్వాత కూడా మళ్లీ క్యాన్సర్‌‌‌‌ వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్లు గత అనుభవాలతో ముందుగానే పసిగట్టి అనుమానం రాగానే డాక్టర్‌‌‌‌ని కలవాలి. 

ట్రీట్‌‌మెంట్‌‌తో పాటు.. 
డాక్టర్లు సూచించిన ఫుడ్‌‌ తీసుకోవాలి. ప్రత్యేక డైట్‌‌ ప్లాన్‌‌ రూపొందించుకోవాలి. క్యాన్సర్‌‌‌‌ వల్ల కలిగే ఆందోళన, ట్రీట్‌‌మెంట్‌‌లో భాగంగా ఎదుర్కొన్న సమస్యల వల్ల ఒత్తిడికి గురవుతారు. కాబట్టి స్ట్రెస్‌‌ తగ్గించుకునేందుకు రెగ్యులర్‌‌‌‌గా మెడిటేషన్‌‌, వాకింగ్‌‌ లాంటివి చేయాలి. తగినంత నిద్రతోపాటు విశ్రాంతి తప్పనిసరి. సాధారణంగా క్యాన్సర్‌‌‌‌ ట్రీట్‌‌మెంట్స్‌‌ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. కాబట్టి తరచూ చేతులు కడుక్కోవడం, అంటువ్యాధులు ఉన్నవాళ్లకు దూరంగా ఉండడం లాంటి జాగ్రత్తలు పాటించాలి.