3 రోజుల్లో నివేదిక ఇవ్వండి: స్వాతి కేసులో తెలంగాణ డీజీపీకి జాతీయ మహిళ కమిషన్ ఆదేశం

3 రోజుల్లో నివేదిక ఇవ్వండి: స్వాతి కేసులో తెలంగాణ డీజీపీకి జాతీయ మహిళ కమిషన్ ఆదేశం

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మేడిపల్లి స్వాతి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వాతి మర్డర్ కేసును జాతీయ మహిళ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి లేఖ రాసిన జాతీయ మహిళ కమిషన్.. స్వాతి కేసుకు సంబంధించిన సమగ్ర నివేదికను మూడు రోజుల్లో అందించాలని ఆదేశించింది. కాగా, అనుమానంతో స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య చేయడమే కాకుండా భార్య శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేసి మూసీలో పడేశాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించడంతో ఈ కేసులోకి జాతీయ మహిళ కమిషన్ ఎంటర్ అయ్యింది.

వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చారు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నాడు. స్వాతి పంజాగుట్టలోని కాల్ సెంటర్లో పనిచేసింది. ఇద్దరి మధ్య గొడవలు ఉండేవి. పెద్దల సమక్షంలో కాంప్రమైజ్ అయ్యారు. అయినప్పటికీ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడేవాళ్ళు. 

ఇదే తరహాలో మొన్న.. 2025, ఆగస్ట్ 22న కూడా గొడవ పడ్డారు. స్వాతి గర్భవతి కావడంతో మెడికల్ చెకప్కి తీసుకెళ్ళమని భర్తని అడిగింది. ఈ విషయంలో మొదలైన గొడవ పెద్దదయింది. భార్య స్వాతిని హత్య చేయాలని మహేందర్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. బోడుప్పల్లో ఒక హాక్సా బ్లేడ్ కొన్నాడు. ఇంట్లో ఉన్న భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత హాక్సా బ్లేడ్తో స్వాతి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు.

తల ఒకసారి.. కాళ్ళు ఒకసారి.. చేతులు మరోసారి.. ఇలా మూడు సార్లు కవర్లలో చుట్టి శరీర భాగాలను ప్రతాప్ సింగారం మూసీలో పడేశాడు. అనంతరం కుటుంబ సభ్యుల సూచన మేరకు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. పోలీసులు స్వాతి మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. శరీర భాగాల కోసం మూసీలో  వెతికారు. 

వర్షాలతో వరద భారీగా ప్రవాహిస్తుండటంతో మూసీలో 10 కిలో మీటర్ల మేరకు వెతికన ఫలితం దక్కలేదు. స్వాతి మొండానికి డీఎన్ఏ, పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శరీర భాగాలు లేకుండా కేవలం స్వాతి మొండానికే అంత్యక్రియలు నిర్వహించారు ఆమె కుటుంబ సభ్యులు. పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించారు