డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ

డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ

జూబ్లీహిల్స్ పరిధిలో బాలిక అత్యాచారం కేసుపై  జాతీయ మహిళా కమిషన్  సీరియస్ గా  స్పందించింది. ఈ కేసులో నేరుగా జోక్యం చేసుకొని, దోషులకు త్వరితగతిన శిక్షపడేలా చూడాలంటూ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి మంగళవారం లేఖ రాసింది. రాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను ఏడు రోజుల్లోగా సమర్పించాలని నిర్దేశించింది. తెలంగాణలో తాజాగా చోటుచేసుకున్న రెండు అత్యాచార ఘటనలపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఘాటుగా స్పందించారు.‘‘ ఒక కేసులో రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది.వాళ్లు బాధిత బాలికను టార్గెట్ గా చేసుకునే ముప్పు ఉన్నందున ఆ కేసు చాలా తీవ్రమైంది. సున్నితమైంది. తాజాగా మంగళవారం మరో అత్యాచార ఘటనకు సంబంధించిన సమాచారం కూడా మాకు అందింది. దానిపైనా మేం దృష్టిసారిస్తాం’’ అని రేఖా శర్మ స్పష్టంచేశారు. 

దర్యాప్తు ముమ్మరం.. 

జూబ్లీహిల్స్ బాలిక కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కేసులో ఐదో నిందితుడు పరారీలో ఉండటంతో అతని ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే కొడుకుపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఆ వాంగ్మూలం ఆధారంగా ఎమ్మెల్యే కుమారునిపై కేసు నమోదుచేసేందుకు న్యాయ సలహా తీసుకున్నారు.ఇదిలా ఉంటే నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నిందితులకు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.