వ్యవసాయానికి ఉపాధి కూలీలు..త్వరలో చట్టం

వ్యవసాయానికి ఉపాధి కూలీలు..త్వరలో చట్టం
  • పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కరీంనగర్: ఉపాధి హామీ పనుల కూలీలను వ్యవసాయ కోసం ఉపయోగించే చట్టం తేవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. దీనిపై అన్ని వర్గాలతో ఆరా తీస్తున్నారని ఆయన చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో రైతు వేదిక ను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. అలాగే గూనిపర్తి నుండి బత్తినివానిపల్లె 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్లు విస్తరణ  పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం టీఆరెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనను నియోజకవర్గానికి రానీయలేదన్నారు. దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. పండిన పంటను ప్రతి గింజ కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. ఈటల తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పులేనని, కన్నతల్లి లాంటి టీఆరెస్ పార్టీకి మోసం చేసిన వారు ఎవరు పార్టీలో వుండరన్నారు. ఎవరు ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్లు ఈ పనులన్నీ చేయాల్సి  ఉండేది, కానీ చేయలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచారని చెప్పి ఇప్పుడు బీజేపీ ఎంత పెంచిందో చూడండని ఎద్దేవా చేశారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెచ్చి రైతులను మోసం చేసే కేంద్రంలోని  ప్రభుత్వం బీజేపీ పార్టీదని ఆరోపించారు. కేసీఆర్ తమకు ఆదేశాలు ఇచ్చారని, కమలాపూర్ మండలాన్ని ధర్మారెడ్డి ఆధ్వర్యంలో నేను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. టీఆరెఎస్ పార్టీ ఆనాడు టిక్కెట్ ఇచ్చింది కాబట్టి మీరు ఈటలకు సపోర్ట్ చేశారు, ఆనాడు ఈటల కాకుండా ఎవరికి టిక్కెట్ ఇచ్చిన ఇక్కడ గెలిచేవారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.