ప్రముఖ మలయాళ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ మలయాళ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ మలయాళ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ (90) నిన్న చెన్నైలో  కన్ను మూశారు. మద్రాస్ ప్రెసిడెన్సీలోని పాల్‌‌‌‌‌‌‌‌ఘాట్‌‌‌‌‌‌‌‌లో 1931లో జన్మించారు మాధవన్. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. కె.రామనాథ్, ఎల్వీ ప్రసాద్, ఏఎస్‌‌‌‌‌‌‌‌ఏ స్వామి వంటి  దర్శకుల దగ్గర అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేశారు. 1960లో ‘వీరవిజయ’ అనే సింహళ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆరు భాషల్లో అరవైకి పైగా చిత్రాలు తీశారు. పది జాతీయ అవార్డులు, తొమ్మిది కేరళ స్టేట్ అవార్డులతో పాటు ఒక నంది  అవార్డును కూడా అందుకున్నారు. కేరళ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ‘జేసీ డ్యానియెల్’ అవార్డును కూడా మాధవన్ అందుకున్నారు. ‘కన్నుమ్ కరలుమ్’ అనే సినిమాతో కమల్ హాసన్‌‌‌‌‌‌‌‌ని మాలీవుడ్‌‌‌‌‌‌‌‌కి చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం చేసింది మాధవనే. మలయాళంలో కమల్ మొదటిసారి హీరోగా నటించింది కూడా మాధవన్ తీసిన సినిమాతోనే. మలయాళ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మమ్ముట్టికి కూడా మాధవన్ తీసిన చిత్రంతోనే బ్రేక్ వచ్చింది. కెరీర్ మొత్తంలో ఎన్నో గొప్ప చిత్రాలు తీసి ‘చలనచిత్ర రత్న’ అనే బిరుదును సొంతం చేసుకున్నారు మాధవన్. పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘పడవ ప్రయాణం’ కథ ఆధారంగా తెలుగులో ‘ స్త్రీ’ అనే చిత్రాన్ని తీశారు. దీనికి జాతీయ పురస్కారంతో పాటు నంది అవార్డ్ కూడా వచ్చింది. ఆయన సాధించిన విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయంటూ ఇండస్ట్రీ మొత్తం మాధవన్‌‌‌‌‌‌‌‌కి నివాళి అర్పించింది.